TDP : వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకం. ఒక విధంగా చెప్పాలంటే చావోరేవోలాంటివి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచితీరాలి. లేకుంటే దాదాపు టీడీపీ చాప్టర్ క్లోజ్. మరోసారి జగన్ గెలిచారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించిందే. ముఖ్యంగా చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. గౌరవప్రదమైన రిటైర్మెంట్ దక్కే స్థితి ఉండదు. కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వకుండానే రాజకీయాల నుంచి నిష్క్రిమించాల్సి ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ నమ్ముకున్న అభివృద్ధి నినాదాన్ని చంద్రబాబు పక్కన పడేశారు. సంక్షేమ పథకాలపై పడ్డారు. జనరంజకమైన పథకాలను ప్రకటించారు. అయితే సంక్షేమం విషయంలో ఆయనది పేలవ ప్రదర్శన. అందుకే ప్రజల నమ్మకాన్ని పొందడం తలకు మించి భారం అవుతోంది.
2004 ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించారు. అందులో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుపరిచారు. అయితే అది సాధ్యం కాదని నాటి చంద్రబాబు తేల్చిచెప్పారు. కానీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత చేసి చూపించారు. అది ఇప్పటివరకూ కొనసాగుతోంది. ఈ ఒక్క పథకంతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమానికి ఆధ్యుడయ్యాడు. చంద్రబాబు పథకాల వ్యతిరేకి అన్న అపవాదును దక్కించుకున్నారు. నాడు కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజశేఖర్ రెడ్డి ఎన్నో పథకాలను అమలుచేసి చూపించారు. సంక్షేమానికి చిరునామాగా మారారు. కుమారుడు జగన్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పడంతో ప్రజలు బలంగా నమ్మారు.
2019 ఎన్నికలకు ముందు జగన్ నవరత్నాలను ప్రకటించారు. వాటికి ప్రాధాన్యతనిస్తానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చానని చెబుతున్నారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు.. కానీ ప్రజారంజకమైన ప్రధాన పథకాలు అమలుచేశారు. నేరుగా ప్రజలకు నగదు పంపిణీ చేశారు. దీంతో మెజార్టీ ప్రజల్లో సంక్షేమ పథకాలపై సంతృప్తి కనిపిస్తోంది. కానీ అభివృద్ధిలో వెనుకబడడంతో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అభివృద్ధి విషయంలో ఫెయిలైనా.. సంక్షేమం విషయంలో మాత్రం జగన్ కు మంచి మార్కులే పడ్డాయి.
అయితే వచ్చే ఎన్నికల్లో విజయం దక్కాలంటే తప్పనిసరిగా సంక్షేమ పథకాలు ప్రకటించాలని చంద్రబాబు డిసైడయ్యారు. మొన్నటి మహానాడులో మినీ మేనిఫెస్టో ఒకటి ప్రకటించారు. భారీ పథకాలే అయినా ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. 2009లో నగదు బదిలీ పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చారు. అప్పట్లో రిజిస్ట్రేషన్లు సైతం చేశారు. కానీ అప్పట్లో ప్రజారాజ్యం రూపంలో త్రిముఖ పోటీ నెలకొనడంతో టీడీపీకి విజయం దక్కలేదు. అటు తరువాత చంద్రబాబు సంక్షేమం జోలికి వెళ్లలేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించారు. అప్పట్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. వాటిలో నిరుద్యోగభృతి ఒకటి. అప్పట్లోనే నిరుద్యోగులకు భృతి ఇస్తానని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదు. ఈసారి మళ్లీ అలాంటి హామీనే ఇచ్చారు. ఒకసారి అమలు చేయని వ్యక్తి.. రెండోసారి అమలు చేస్తాడంటే నమ్మడం కష్టం. ప్రతి ఇంటికీ మంచి నీళ్ల కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో కూడా దీన్ని నెరవేర్చలేదు. రైతులకు ప్రతి సంవత్సరం రూ.20 వేలు ఇచ్చే పథకం తెస్తామన్నారు. అంటే కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తారా? లేక ఆ ఆరు వేలను కలిపి రూ.20 వేలు ఇస్తారా? స్పష్టత లేదు. మరోవైపు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రూ.1500 నెలనెలా ఇస్తామన్నారు. అసలిది సాధ్యమేనా? రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన మహిళలు ఎంత మంది ఉన్నారు? వాళ్లందరికీ ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ కేటాయించాలి? నిధులు ఎలా వస్తాయి? ఇవన్నీ బాబు లెక్కలేశారా? అంటే అనుమానమే.
టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూస్తే అవి కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్లను ఆకట్టుకునేందుకే ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే వీటన్నింటినీ అమలు చేయడం అంత సులువైన పని కాదు. ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయేసరికి చంద్రబాబు ఒక కొత్త ఆలోచన చేశారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా పథకాలు అమలుచేస్తామని చెబుతూ లబ్ధిదారులకు టోకెన్లు అందించడానికి నిర్ణయించారు. ప్రతిఇంట్లో లబ్ధిదారులకు టోకెన్లు అందించనున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత టోకెన్లు చూపిస్తే పథకాలు వర్తించేలా ప్లాన్ చేశారు. అయితే ఈ భారీ వ్యూహం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.