Rammohan Naidu : ఆ యువనేత అంటే టిడిపి ( Telugu Desam)శ్రేణులకు ప్రేమ, అభిమానం,గౌరవం. ఆయన మాటలకు పులకించుకుపోతారు. తమ అభిమాన నాయకుడిగా ఆరాధిస్తారు. కానీ అటువంటి నేతపై టిడిపి క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించింది. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి అంటే.. సినీ గాయని మంగ్లీ కి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లడమే. గతంలో మంగ్లీ వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ టిడిపి క్యాడర్ ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతోంది. అదే ఆగ్రహాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పై చూపిస్తోంది.
* సిక్కోలులో భారీ ఈవెంట్
రథసప్తమి సందర్భంగా అరసవల్లి( arasavilli ) సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పండుగగా దీనిని ఏర్పాటు చేశారు. భారీ ఈవెంట్లు నిర్వహించారు. బుల్లితెర నటులు హాజరయ్యారు. ఈ క్రమంలో గాయని మంగ్లీ కూడా శ్రీకాకుళం వచ్చారు. పనిలో పనిగా సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఆమె విఐపి కావడంతో ఆ తరహాలో గౌరవ మర్యాదలు అందుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆమె పక్కనే నిలబడ్డారు. అది టిడిపి క్యాడర్ కు ఆగ్రహం తెప్పించింది. రోలింగ్ మొదలుపెట్టారు. వైసీపీ సింగర్ మంగ్లీని దగ్గరుండి దర్శనం చేయించడం పై రామ్మోహన్ నాయుడు పై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని దర్శనానికి ఎలా తీసుకెళ్లారంటూ ప్రశ్నించడం ప్రారంభించారు.
* వైసీపీకి ఫేవర్ చేసిన మంగ్లీ
2019లో వైసీపీ కోసం మంగ్లీ ( singer mangli) పాడిన పాట ఒక ఊపు ఊపేసింది. అటు తరువాత గత ఐదేళ్లపాటు మంగ్లీ కి వైసీపీ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. వెంకటేశ్వర భక్తి ఛానల్ లో సైతం నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసినట్లు టిడిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. టిడిపి తరఫున పాటలు పాడమంటే పాడలేదని.. కనీసం చంద్రబాబు పేరు పలకనున్న మంగ్లీ.. వీఐపీ ఏ విధంగా అయ్యారని.. 40 సంవత్సరాల పాటు కష్టపడిన మాలాంటి వారికి స్వామి వారి వీఐపీ దర్శనం దక్కడం లేదని.. కానీ వైసీపీ కోసం పని చేసిన మంగ్లీకి ఇట్టే దొరికిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టోల్ చేస్తున్నారు టిడిపి శ్రేణులు.
* యువనేత పై విమర్శలు వద్దు
అయితే టిడిపి సోషల్ మీడియా( TDP social media) దీనిపై మరో రకమైన ప్రకటన చేసింది. తెలుగుదేశం పార్టీ కోసం రామ్మోహన్ నాయుడు ఎంతగానో కష్టపడ్డారని.. జాతీయస్థాయిలో పార్టీ కోసం అలుపెరుగని పోరాటం చేశారని.. అటువంటి వ్యక్తికి టార్గెట్ చేయడం తగదని.. ఏమైనా అనాలనుకుంటే మంగ్లీ పై కామెంట్స్ చేయవచ్చు కానీ.. రామ్మోహన్ నాయుడు పై వద్దని వినతులు వస్తున్నాయి. మొత్తానికైతే మంగ్లీ శ్రీకాకుళం టూర్ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మెడకు చుట్టుకుంది.