TDP vs Arnab Goswami: దేశంలో ఇప్పుడు ఇండిగో( Indigo) విమాన సంక్షోభం చర్చకు దారితీసింది. ఒక ప్రైవేటు ఎయిర్లైన్స్ నిర్వాకం మూలంగా దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది విమాన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పైలెట్లకు విశ్రాంతి ఎక్కువగా ఇవ్వాలన్న నిబంధనను ఇండిగో విస్మరించింది. దానితో ఏకీభవించకుండా విమాన సర్వీసులను ఉపసంహరించుకుంది. ఒకేసారి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో లక్షలాదిమంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విమానాశ్రయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే దీనితో ఏపీ ప్రభుత్వానికి కానీ.. తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం లేదు. కానీ అనవసరంగా కెలికారు టిడిపి నేత దీపక్ రెడ్డి. ఆర్నాబ్ గోస్వామి తన రిపబ్లికన్ టీవీలో విమాన ప్రయాణికుల ఇబ్బందులపై డిబేట్ నిర్వహించారు. కేవలం విమాన ప్రయాణికులను ఉద్దేశించి ఈ చర్చ సాగింది. ఏపీ నుంచి టీడీపీ నేత దీపక్ రెడ్డి ఈ డిబేట్లో పాల్గొన్నారు. తన అభిప్రాయం చెప్పే క్రమంలో మంత్రి నారా లోకేష్ పేరు తెరపైకి తెచ్చారు. ఈ విమాన సంక్షోభం నియంత్రించేందుకు మంత్రి నారా లోకేష్ వార్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఆ పని చేసేందుకు లోకేష్ పౌర విమానయాన శాఖ మంత్రి కాదు కదా అని ఆర్నాబ్ గోస్వామి ప్రశ్నించారు. అంతటితో ఊరుకున్నారు.
టార్గెట్ చేసిన టిడిపి..
అయితే ఈ వివాదం ఇలా ఉండగానే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పై( Ram Mohan Naidu ) సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం సాగింది. ఆపై మంత్రి నారా లోకేష్ విషయంలో దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేశారు ప్రత్యర్ధులు. అది మొదలు ఆర్నాబ్ గోస్వామిని టార్గెట్ చేసుకున్నారు టిడిపి శ్రేణులు. రిపబ్లిక్ అండ్ టీవీ ఇలాంటిది అలాంటిది అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్నాబ్ గోస్వామి జర్నలిస్టు ముసుగులో ఎన్నెన్నో చేశారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువ కావడంతో ఆర్నాబ్ గోస్వామి వరకు వెళ్ళింది ఇది. నన్నే ప్రశ్నిస్తారా? రిపబ్లిక్ టీవీని నిషేధిస్తారా అంటూ గట్టిగానే ప్రశ్నించారు ఆయన. దీంతో ఇది కొత్త రచ్చకు దారితీసింది. కేంద్ర పౌర విమానయాన శాఖను నిర్వహిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వ్యతిరేకంగా ఇప్పుడు రిపబ్లిక్ టీవీలో కథనాలు వస్తున్నాయి.
కష్టకాలంలో అండగా..
వాస్తవానికి టిడిపి శ్రేణులు ఒక విషయాన్ని గ్రహించాలి. ఆర్నాబ్ గోస్వామి( Arnab Goswami) తెలుగుదేశం పార్టీకి చాలా ఫేవర్ చేశారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు అభిమాని కూడా. దేశంలోనే ఒక ప్రముఖ జర్నలిస్టుగా ఉంటూ ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పేరు మోసిన జర్నలిస్టులు ఎవరు తమకు నచ్చిన నేత విషయంలో బయటపడరు. అటువంటిది ఆర్నాబ్ గో స్వామి ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా నేషనల్ మీడియా ముఖం చాటేసింది.. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ప్రభావం కూడా నేషనల్ మీడియా పై పడింది. కానీ ఆ సమయంలో మంత్రి లోకేష్ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చారు ఆర్నాబ్ గోస్వామి. జాతీయస్థాయిలో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ఫోకస్ చేసింది కూడా ఆయనే. ఆర్నాబ్ గోస్వామిని మిగతా పార్టీలు వ్యతిరేకించవచ్చు కానీ.. టిడిపి అలా చేయకూడదు కూడా. అయితే ఆర్నాబ్ గోస్వామి తో పాటు రిపబ్లిక్ టీవీ విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిషేధం ప్రకటించిందా? లేకుంటే ప్రత్యర్థులు అలా ప్రచారం చేస్తున్నారా అన్నది నాయకత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆర్నాబ్ గోస్వామి తో పాటు రిపబ్లిక్ టీవీ నుంచి సైతం ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు.