TDP And BJP: అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడికి వెళ్లడం నేటి రాజకీయం. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత కాలం.. బీఆర్‌ఎస్‌లో ఉన్న వివిధ పార్టీల నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతోపాటు మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా చాలా మంది లైన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. నెల క్రితం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైంది. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరోవైపు అధికార టీడీపీ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోత్సాహంలో ప్రత్యర్థ వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లోనే వందలాది దాడులు జరిగాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా కూడా తలపెట్టారు. రాబోయే ఐదేళ్లు వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతోపాటు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా అధికార పార్టీలవైపు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రభుత్వానికి కూడా పెద్దగా ఇబ్బంది లేదు. దీంతో ఎమ్మెల్యేల చేరికలను ప్రోత్సహించే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక సంస్థలను వశం చేసుకునేందుకు మాత్రం టీడీపీ దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవలై వైసీపీ అధీనంలో ఉన్న జీవీఎంసీని కైవసం చేసుకునేందుకు చేరికలకు అనుమతి ఇచ్చింది.
బీజేపీలో విచిత్ర పరిస్థితి..
ఇదిలా ఉంటే.. చేరికల విషయంలో బీజేపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన ఎంపీలు ఆ పార్టీని వీడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. వారిలో కొందరు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలిచారు. కొందరు మళ్లీ ఎంపీలుగా గెలిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇప్పుడు వారే డామినేట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలను మాజీ టీడీపీ నేతలే డిసైడ్ చేస్తున్నారు. బీజేపీలో చేరేవారు మొదట మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ నేతలనే సంద్రించాలని సూచిస్తున్నారు. వారు పరిశీలించిన తర్వాత అసలైన బీజేపీ నేతల వద్దకు పంపుతున్నారు. అంటే టీడీపీ, బీజేపీ నేతలు అనుమతి ఇస్తేనే.. బీజేపీలో చేరికలు జరిగే పరిస్థితి నెలకొంది.
టీడీపీకి రాసిచ్చారా..
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో టీడీపీ మాజీ నేతల డామినేషన్ చూస్తుంటే.. బీజేపీని మోదీ, అమిత్‌షా ఏమైటీ టీడీపికి రాసి ఇచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే త్రిమూర్తులు బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారట. అయితే ముందుగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు త్రిమూర్తులతో మాట్లాడారు. తర్వాత సీనియర్ బీజేపీ నేతల వద్దకు పంపించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీని టీడీపీకి ఏమైనా రాసి ఇచ్చారా అన్న పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంప్రదాయం బీజేపీకి మంచిది కాదని బీజేపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధిష్టానం దృష్టి సారించాలని కోరుతున్నారు. కొందరు బీజేపీ సీనియర్ నేతలు ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More