TDP 42nd Foundation Day: తెలుగుదేశం.. జాతీయస్థాయిలో ఒక చరిత్ర సృష్టించిన పార్టీ. ఢిల్లీ పెత్తనాన్ని సహించలేక తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా నందమూరి తారకరామారావు ఏర్పాటు చేసిన పార్టీ ఇది.నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎన్నో సంక్షోభాలను, మరెన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాలు అంటే తక్కువ సమయం కాదు. జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక మనుగడ కోసం పోరాటం సాగిస్తుంటే… ఒక ప్రాంతీయ పార్టీ అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడడం ఆషామాషీ కాదు.నందమూరి తారక రామారావు పార్టీని ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు సుదీర్ఘకాలం నడిపించగలిగారు. రాజకీయ యవనికపై నిలబెట్టగలిగారు.
నందమూరి తారక రామారావు వెండితెరపై మెరిసిపోతున్న రోజులు అవి. ఢిల్లీ పెత్తనంతో తెలుగు రాజకీయాలు సతమతమవుతున్న రోజులు అవి. అటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు. 1982 మార్చి 29న హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 40 మందితో ఎన్టీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఆ క్షణంలో ఈ తెరవేల్పు.. తెలుగు నాట ప్రతి ఇంట ఇలవేల్పుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కానీ ఎన్టీఆర్ ప్రకటనను కాంగ్రెస్ పెద్దలు లైట్ తీసుకున్నారు. కానీ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీకి భారీ విజయం కట్టబెట్టారు.
అయితే ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎన్నెన్నో సంక్షోభాలను అధిగమించింది. మొదటి 14 సంవత్సరాలు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్లు పనిచేశారు. ఎన్నో జనాకర్షణ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎంతోమంది బీసీ నాయకులను ఈరాష్ట్రానికి అందించారు. ఆయన మాట్లాడే మాటకు.. ఆయన బాటకు తెలుగు జనాలు నీరాజనాలు పలికారు. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు అది ఒక శక్తి అని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు గ్రహించారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు 28 సంవత్సరాలుగా అప్రతిహసంగా కొనసాగిస్తున్నారు. 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది. ఉమ్మడి రాష్ట్రంలో 16 సంవత్సరాలు, విభజిత ఏపీలో ఐదు సంవత్సరాలు.. మొత్తం 21 సంవత్సరాలు అధికారపక్షంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూల దోసింది. 1985లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం జరిగింది. తిరిగి అధికారం టిడిపి కైవసం చేసుకుంది. 1984లో ఇందిరా గాంధీ హత్యతో లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఏపీలో మాత్రం టిడిపి నిలబడింది. 42 పార్లమెంట్ స్థానాలకు గాను 35 సీట్లను గెలుచుకుంది. లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఐదేళ్లపాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. 1995లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఎదురయింది. ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబుకు హస్తగతం అయింది. ఎన్టీఆర్ మరణంతో టిడిపి పని అయిపోతుందని అంతా భావించారు. కానీ చంద్రబాబు 1999లో సైతం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోగలిగారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓటమి ఎదురైనా.. 2014లో విజయం అందుకున్నారు. కానీ 2019లో ఘోర పరాజయం పొందారు. ఇక టిడిపి కోలుకోదని భావించారు అంతా. కానీ పడి లేచిన కెరటంగా పోరాడడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఈ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది.