Swarna Bharathi Indoor Stadium: విశాఖ( Visakhapatnam) నగరానికి అన్ని హంగులను సమకూర్చుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తున్నాయి. పర్యాటక ప్రాజెక్టులు సైతం ప్రారంభం అయ్యాయి. తాజాగా క్రీడలకు సంబంధించిన నిర్మాణాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ నగర నడిబొడ్డున స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం పునః ప్రారంభం అయ్యింది. రూ.16.90 కోట్లతో ఇండోర్ స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. నిన్ననే స్టేడియం ను ప్రారంభించారు. స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం పెంపు, సెంట్రల్ ఏసి, సీసీ కెమెరాల వ్యవస్థ, బ్యాడ్మింటన్ కోర్టులు వంటివి ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు..
ఇప్పటికే క్రీడా పోటీలకు సంబంధించి చాలా స్టేడియంలు అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్ కు సంబంధించి మధురవాడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ మ్యాచులు జరుగుతున్నాయి. ఏపీ తరఫున ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు అదే స్టేడియం వేదికగా నిలుస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం కూడా అందుబాటులోకి రావడంతో.. ఇతర క్రీడలకు కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కలిగింది. విశాఖ నగరం నడిబొడ్డున ఉంటుంది ఈ స్టేడియం. అత్యాధునికంగా దీనిని నిర్మించారు. సుమారుగా 1750 మంది ప్రేక్షకులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం పెంచారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎదుర్కొనేందుకు అధునాతన ఫైర్ ఫైటింగ్ యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఏసీ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.
స్వర్ణ భారతి ప్రత్యేకం..
గ్రేటర్ విశాఖ( greater Visakha) మున్సిపల్ కార్పొరేషన్ కు 12 చోట్ల క్రీడా మైదానాలు ఉన్నాయి. భీమిలిలో మున్సిపల్ ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలు ఉన్నాయి. అయితే అన్నింటికంటే సౌకర్యవంతంగా స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఉంటుంది. ఇక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు జరుగుతుంటాయి. స్టేడియంలో ఆధునికరించడంతో మున్ముందు మరిన్ని అంతర్జాతీయ మ్యాచులకు వేదిక కానుంది ఈ స్టేడియం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం.. ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖ వస్తుండడంతో.. క్రీడా పరంగా కూడా మహా విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందనుంది.