Evms Temparing: ఈవీఎంలపై అనుమానాలు.. ఈసీ తీరు అలానే.. నిజమైతే ప్రమాదంలో ప్రభుత్వం

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈవీఎంలపై అనుమానం ఆనవాయితీగా వస్తోంది. 2019లో చంద్రబాబు సైతం ఇదే మాదిరిగా అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ ఈసీ తీరుపై అనుమానం వ్యక్తం చేస్తోంది.

Written By: Dharma, Updated On : August 30, 2024 10:17 am

Evms Temparing

Follow us on

Evms Temparing: ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువుదీరింది. పాలన ప్రారంభమైంది. అయితే విపక్షం నుంచి మాత్రం ఒక అనుమానం పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల టాపింగ్ జరిగిందన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. అదే సమయంలో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్), ఓట్ ఫర్ డెమొక్రసీ (విఎఫ్డి) అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బలమైన చర్చ నడుస్తోంది. మరోవైపు వివి ప్యాట్ల వెరిఫికేషన్ చేయాలని వైసిపి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన పోలింగ్ శాతానికి, తరువాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఏపీలో ఏకంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే చాలామంది వైసిపి అభ్యర్థులు నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఫారం 20 నమోదు చేస్తే మాత్రం అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు సీరియస్ గా ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకంగా కూడా మారుతుంది.

* వైసీపీ అభ్యర్థుల ఫిర్యాదులు
ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి నుంచి పోటీ చేసిన సంభంగి వెంకట చిన అప్పలనాయుడు.. తదితరులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల అధికారులు వివి ప్యాట్లను లెక్కించకుండా.. కేవలం మాక్ పోలింగ్ నిర్వహించి వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు ఇదే మాదిరిగా పిటీషన్లు వేస్తే సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మెజారిటీ వంటి వివరాలతో ఫారం 20 ని ఎన్నికల కమిషన్ విధిగా ప్రకటించాలి. అదే జరిగితే భారీగా లోపాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

* చాలా రకాల అనుమానాలు
ఈవీఎంలలో లోపాలపై చాలా రకాల వార్తలు బయటకు వచ్చాయి.విజయనగరం లోక్సభను ఉదాహరణగా తీసుకుంటే.. మే 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అయితే ఈవీఎంలలో చార్జింగ్ 99% ఉంది. మూడు వారాల వరకు ఈవీఎంలు యాక్టివ్ గా ఉంటే ఒక్క శాతం మాత్రమే చార్జింగ్ ఖర్చు కావడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపైనే వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.విచారణ కోసం ఆయన రూ.94,400 ఫీజుగా కూడా చెల్లించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు.

* ఏపీ పై సందేహాలు
అయితే ఏపీలో ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసిపి ఫిర్యాదులపై ఎన్నికల అధికారుల వ్యవహార శైలి సైతం అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ అభ్యర్థుల ఫిర్యాదులపై విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనుకడుగు వేస్తుండడం విస్మయం కలిగిస్తోంది. అభ్యర్థులు ఒకటి కోరితే..ఎన్నికల అధికారులు మాత్రం ఇంకోలా వస్తున్నారు. వివి ప్యాట్లను లెక్కించమని కోరితే మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు.అయితే కొంతమంది వైసీపీ అభ్యర్థులకు నేరుగా ఎన్నికల అధికారులు సంప్రదించారు.ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే ఈ అనుమానాల మధ్య వీటిపై సమగ్ర విచారణ చేపడితే మాత్రం.. తప్పకుండా లోపాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడక తప్పని పరిస్థితి.