Vivekananda Reddy Case Updates: వైఎస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సిబిఐ ఇప్పటికే విచారణ పూర్తి చేసినట్లు చెప్పిన నేపథ్యంలో కొన్ని రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ వైయస్ సునీత ఇదే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయాలని సూచించడంతో ఆమె కింది కోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె లేవనెత్తిన అనుమానాలు, ఆపై నిందితులుగా భావిస్తున్న వారిని విచారించకుండానే సిబిఐ దర్యాప్తు పూర్తి అవ్వడాన్ని ప్రస్తావించారు. కానీ కింది కోర్టు అవేవీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మళ్లీ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు విచారణ జరగగా కోర్టు ఆసక్తికరమైన అంశాలను సిబిఐ ని అడిగి తెలుసుకుంది. వచ్చేనెల ఐదుకు విచారణను వాయిదా వేసింది.
అభిప్రాయాన్ని అడిగిన కోర్టు..
ప్రధానంగా ఈ కేసులో దర్యాప్తు పూర్తిస్థాయిలో ముగిసింది అని సిబిఐ కోర్టుకు చెబితే.. సుప్రీంకోర్టు ఈ కేసును ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. సిబిఐ దర్యాప్తు పూర్తిగా జరిగిందా? ఇంకేమైనా దర్యాప్తు చేయాల్సి ఉందా? అని అడిగింది కోర్టు. అయితే సునీత మాత్రం జగన్మోహన్ రెడ్డి దంపతులకు ముందుగానే ఎలా తెలిసింది అనేది సందేహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే కీ పాయింట్ అని చెప్పుకొచ్చారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి దంపతులకు ఎవరు చెప్పారు అన్నది సునీత సందేహం. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని ఆమె ఆది నుంచి సందేహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రైల్ కోర్టుకు సునీత రాగా.. అందరూ కుటుంబ సభ్యులు కావడం వల్లే సమాచారం ఇచ్చి ఉంటారని కోర్టు అభిప్రాయ పడింది. అయితే దీనితో ఏకీభవించలేదు సునీత. అందుకే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ అభిప్రాయం అడిగింది.
కీలక ఘట్టం
అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఘట్టం ఆసన్నం అయిందన్నమాట. ఇప్పుడు సిబిఐ తన మనసులో ఉన్న మాటను కచ్చితంగా చెప్పాల్సిందే. సీరియస్ గా విచారణ చేపట్టామని చెప్పాలి. లేకుంటే కొంతమందిని విచారణ చేయాల్సి ఉందని చెప్పాలి. కానీ ఏదో ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. అప్పుడే అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సిబిఐ మళ్లీ దర్యాప్తును కోరితే మాత్రం అత్యున్నత న్యాయస్థానం సమ్మతించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సిబిఐ ఏమి చెబుతోంది అనేది హాట్ టాపిక్. ఆ విషయం వచ్చే నెల 5న తేలనుంది.
