Sajjala Ramakrishna Reddy : వైసిపి హయాంలో కీలకంగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా తనదైన ముద్రను చాటుకున్నారు. ఈ క్రమంలో సజ్జల ఆదేశాలతో అప్పటి యంత్రాంగం ప్రత్యర్థులను వెంటాడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి చాలదు అన్నట్టు ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు సేవలందించారు. ఆ విభాగానికి ఇన్చార్జిగా కూడా ఉండేవారు. అయితే ఆయన ప్రోత్సాహంతో రాజకీయ ప్రత్యర్థులను వైసీపీ సోషల్ మీడియా వెంటాడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రీ కొడుకులు పై ఫోకస్ పెరిగింది. ఇప్పటికే టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపించింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా విభాగం పై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సజ్జల భార్గవ్ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించారు. తనపై నమోదవుతున్న కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే సజ్జల పిటిషన్ పై సంచలన తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ అవుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇచ్చిన సమాచారంతోనే భార్గవరెడ్డి పై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు భార్గవ్ రెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒకానొక దశలో విదేశాలకు వెళ్లిపోయారని కూడా ప్రచారం నడిచింది. అయితే ఇటీవల పట్టు బిగించిన ఏపీ పోలీసులు.. సోషల్ మీడియా నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
* క్వాష్ పిటిషన్ దాఖలు
అయితే తనపై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేయాలని కోరుతూ భార్గవరెడ్డి ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అసలు అంగీకరించలేదు. హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. భార్గవ రెడ్డి తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్ర బలమైన వాదనలు వినిపించ గలిగారు. చట్టాలు ఎప్పటివన్నది కాదని.. మహిళలపై పిటిషన్ చేసిన అసభ్య వ్యాఖ్యలను చూడాలని కోర్టును కోరారు. అలాగే ఆయన విచారణకు సహకరించడం లేదని కూడా చెప్పారు. దీంతో కోర్టు ఈ కేసు పై విచారణను కొనసాగించేందుకు విముఖత చూపింది. రెండు వారాల్లో హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
* అందరిదీ ఇదే వైఖరి
అయితే సోషల్ మీడియా కేసులకు సంబంధించిన నిందితులంతా.. ముందుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అవి వర్కౌట్ కాకపోయేసరికి బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో జరిగింది అదే. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి సైతం ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. అయితే హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా వేధింపుల కేసుల విషయంలో ప్రతికూల ఆదేశాలు వస్తున్నాయి. అదే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఒకవేళ హైకోర్టులో ప్రతికూల తీర్పు ఇస్తే సజ్జల భార్గవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టే.