CM Chandrababu ; ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు రిలీఫ్.. పారని ఆళ్ల పాచిక.. బయట తేల్చుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరిక

చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయి. ఇటీవలే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు పాత కేసులు సైతం పరిష్కారం అవుతున్నాయి. ఆయనపై వేసిన పిటీషన్లను కోర్టులు కొట్టేస్తున్నాయి.

Written By: Dharma, Updated On : August 21, 2024 7:09 pm

Vote For Note case

Follow us on

CM Chandhrababu : ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఉపశమనం కలిగింది. ఆయనను ఇరుకున పెట్టాలని భావించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.చంద్రబాబుపై ఆయన రెండు పిటీషన్లు దాఖలు చేశారు. కానీ సుప్రీం కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. పైగా పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి తీవ్రస్థాయిలో మందలించడం హాట్ టాపిక్ గా మారింది. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే రాష్ట్ర విభజన జరగగా.. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. తెలంగాణలో కెసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్సీ కొనుగోలు విషయంలో చంద్రబాబుపై అభియోగాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు ఓట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రలోభ పెట్టినట్లు ఒక ఆడియో సైతం బయటకు వచ్చింది. అయితే అప్పట్లో కెసిఆర్ ప్రభుత్వం చంద్రబాబుపై కేసు పెట్టేందుకు వెనుకడుగు వేసింది. ఫోన్ టైపింగ్ వివాదం తెరపైకి వస్తుందని భావించి వెనక్కి తగ్గింది. ఈ తరుణంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడం ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే చంద్రబాబు పాత్ర బయటపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. మరోవైపు ఇదే కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మరో పిటిషన్ కూడా వేశారు.

* సుప్రీంకోర్టులో విచారణ
మొన్నటికి మొన్న వైసిపి చంద్రబాబుపై అక్రమాల కేసు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అప్పట్లోనే ఒకసారి ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఆ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలినట్లు అయ్యింది.

* రాజకీయ దురుద్దేశంతో
ఈరోజు ఓటుకు నోటు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లపై జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లు పూర్తిగా రాజకీయ కక్షతోనే వేసినట్లు ధర్మాసనం భావించింది.రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని.. కోర్టులను వేదికగా చేసుకోవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది.

* ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇబ్బందికరమే
2014,2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి.2019లో అయితే మంత్రిగా ఉన్న నారా లోకేష్ పై గెలిచారు. గత ఐదేళ్లుగా న్యాయస్థానాల్లో పిటీషన్లు వేసి టిడిపి నేతలను వెంటాడారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి.అదే మాదిరిగా ఓటుకు నోటు కేసును సైతం తెరపైకి తెచ్చి చంద్రబాబును ఇరికించాలని భావించారు.కానీ అత్యున్నత న్యాయస్థానం ఆయన ఆశలను గండి కొట్టింది. అంతకుమించి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.