Sujana choudhary vs budda venkanna : టిడిపి నుంచి కేశినేని నాని దూరం కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బుద్దా వెంకన్న పాత్ర పై ఆరోపణలు వచ్చాయి. టిడిపిలో ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంకన్న కేశినేని నాని పై విరుచుకు పడడంలో ముందుండేవారు. వెంకన్న లోకేష్ వర్గంగా ముద్రపడ్డారు. లోకేష్ ఆదేశాల మేరకే కేశినేని నాని పై ఆరోపణలు చేసే వారిని అప్పట్లో ప్రచారం జరిగింది. లోకేష్ పాదయాత్రకు నాడు కేశినేని నాని ముఖం చాటేయడానికి కేవలం బుద్దా వెంకన్న కారణమని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఈ ఎన్నికల్లో వెంకన్నకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు. ఆయన ఆశించిన విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా బిజెపి దక్కించుకుంది. అక్కడ నుంచి సుజనా చౌదరి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుజనా చౌదరి గెలుపు కోసం బుద్దా వెంకన్న సైతం ప్రచారం చేశారు. సమన్వయంతో పనిచేశారు. కానీ ఇప్పుడు తనతో పాటు తన అనుచరులకు సరైన గౌరవం దక్కడం లేదని తెగ బాధపడుతున్నారు. తననుకార్యకర్తలు క్షమించాలని బహిరంగంగానే కోరి సంచలనం రేపారు. అన్ని ఎమ్మెల్యేలు చేసుకుంటే తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. సుజనా చౌదరి పేరు ప్రస్తావించకుండానే కూటమిలో విభేదాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వం గెలిచి 50 రోజులు గడవకముందే ఈ విభేదాలు వెలుగు చూడడం.. మూడు పార్టీల శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. అయితే ఇటు సుజనా చౌదరి, అటు బుద్దా వెంకన్న ఇద్దరూ చంద్రబాబుకు సన్నిహిత నేతలు కావడం విశేషం.
* టిడిపి తో మంచి బంధం
తెలుగుదేశం పార్టీతో సుజనా చౌదరికి విడదీయరాని బంధం. వ్యాపారవేత్త అయిన సుజనా చౌదరి 2009 ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పని చేశారు. 2010 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు మోడీ క్యాబినెట్లో సహాయం మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లోటిడిపి ఓడిపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. బిజెపితో టిడిపి పొత్తు కోసం చివరి వరకు ప్రయత్నించిన నేతల్లో సుజనా చౌదరి ఒకరు. ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.పేరుకే బిజెపి కానీ.. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.
* చంద్రబాబుకు భక్తుడు
బుద్దా వెంకన్న సైతం చంద్రబాబుకు భక్తుడు. లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. లోకేష్ కోటరీ లో ముఖ్య నేతగా పేరు ఉంది. ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ.. ఏకంగా తన రక్తంతో చంద్రబాబు పేరును రాశారు. 2014 ఎన్నికల్లో సైతం టిడిపి గెలిచేసరికి బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అప్పటినుంచి దూకుడుగా ఉన్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విమర్శలు చేసే వారిపై హాట్ కామెంట్స్ చేసేవారు. ముఖ్యంగా వైసీపీ వివాదాస్పద నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీల పై సైతం విరుచుకుపడేవారు. ఈ ఎన్నికల్లో తనకు తప్పకుండా టిక్కెట్ ఇస్తారని భావించారు. ఇవ్వకపోయేసరికి అసంతృప్తికి గురయ్యారు. కానీ ఎన్నడు బయట పెట్టలేదు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సుజనా చౌదరి తన్నుకు పోయారన్న బాధ మాత్రం ఉంది. అందుకే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబుతో సుజనా చౌదరికి ఉన్న సాన్నిహిత్యం వెంకన్నకు సైతం తెలుసు.
* వర్గ విభేదాలతో
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న తన వర్గాన్ని తయారు చేసుకున్నారు. బిజెపి అభ్యర్థిగా గెలిచిన సుజనా చౌదరి వెంట సైతం ప్రత్యేక వర్గం ఉంది. సీనియర్ నేతగా, చంద్రబాబుకు స్నేహితుడిగా, బడా పారిశ్రామికవేత్తగా ఉండడంతో తనకంటూ సొంత స్టైల్ లో వెళ్తున్నారు సుజనా చౌదరి. ఈ క్రమంలో తనను పట్టించుకోవడం లేదన్న బాధ బుద్దా వెంకన్న లో కనిపిస్తోంది. అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరి తన అనుచరులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ హయాంలో 37 కేసులు ఎదుర్కొన్నానని చెప్పారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని.. తనను క్షమించాలని కోరుతున్నారు బుద్దా వెంకన్న. అయితే కేశినేని నాని మాదిరిగా కుదిరే పని కాదని.. సుజనా చౌదరి అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వివాదం ముదరక ముందే హై కమాండ్ కలుగ చేసుకోవాలని రెండు పార్టీల శ్రేణులు కోరుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More