Sugali Preethi Case: మరోసారి సుగాలి ప్రీతి( sugali Preeti ) కేసు తెరపైకి వచ్చింది. ఆమె తల్లి పార్వతి దేవి ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జి సినిమాలో డైలాగ్ చెబుతూ పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తమ కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని.. తన కుమార్తెకు న్యాయం చేయలేకపోయారని విమర్శలు చేశారు. గతంలో సైతం ఇదే తరహా ఆరోపణలు చేసిన సుగాలి పార్వతీదేవి.. జనసేన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అయితే తన పోరాట ఫలితం వల్లే నాడు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి భూమితో పాటు ఇళ్ల స్థలం, బాధితురాలు తండ్రికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. కాచిన చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్టు.. ఆ కుటుంబం కి అండగా నిలిచినందుకు తనపై విమర్శలు చేయడం బాధాకరమని చెప్పుకొచ్చారు. అయినా సరే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలకు దిగడం హాట్ టాపిక్ అవుతోంది.
8 ఏళ్ల కిందట ఘటన..
కర్నూలు( Kurnool ) జిల్లాలో 2017లో సుగాలి ప్రీతి అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న ఆమె అదే ఏడాది ఆగస్టు 18న ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంతో పాటు యజమాని కుమారులపై ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణలో భాగంగా కేసు అనేక మలుపులు తిరిగింది. యజమాని తో పాటు ఆయన కుమారులు కేసులో అరెస్టయ్యారు. కొద్ది రోజులకే బెయిల్ పై బయటకు వచ్చారు.
అప్పట్లో పవన్ పోరాటం..
అయితే ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ 2020లో స్పందించారు. కర్నూలులో ర్యాలీ చేశారు. కూటమి అధికారంలోకి వస్తే మొదటి కేసుగా పరిగణలోకి తీసుకొని విచారణ చేపడతామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అటు తరువాత వైసిపి ప్రభుత్వం స్పందించింది. సిబిఐ తో విచారణ చేపడతామని చెప్పుకొచ్చింది. కానీ రకరకాల కారణాలు చెబుతూ విచారణ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అది మొదలు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరోసారి సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి మీడియా ముందుకు వచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గొప్పలు చెబుతున్నారని.. కానీ తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు. అసలు పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడారా అని నిలదీశారు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నమ్మకద్రోహం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీల్ చైర్ యాత్ర చేస్తానంటూ ప్రకటించారు. అవసరం అనుకుంటే కర్నూలు పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి న్యాయం చేయాలని వేడుకుంటానని చెప్పారు. మొత్తానికైతే సుగాలి ప్రీతి తల్లి మరోసారి మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.
నా అవిటితనాన్ని కూడా జనసేన హేళన చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నమ్మకద్రోహి.
నా ఉసిరి తగిలి మీ ముగ్గురు.
సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన. pic.twitter.com/AWUhzCm4Ao
— (@YSJ2024) October 7, 2025