గతేడాది ఇదే సమయంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రజలు కిలో సబ్సిడీ ఉల్లి కొనుగోలు చేయడానికి కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడ్డారు. ఒక దశలో కిలో ఉల్లి 160 రూపాయలు పలికి సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కొనకుండానే కన్నీళ్లు తెప్పించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలపై సైతం ఉల్లి తీవ్ర ప్రభావం చూపింది. ప్రముఖ రెస్టారెంట్లు సైతం ఉల్లి దోశను మెనూ నుంచి తొలగించాయంటే ఉల్లి రేట్లు ఆ సమయంలో ఏ స్థాయిలో పెరిగాయో సులువుగానే అర్థమవుతుంది.
దేశంలో ప్రస్తుతం గతేడాది పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం కిలో 10 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం కిలో 100 రూపాయలు పలుకుతోంది. భవిష్యత్తులో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది లాగే వేల ఎకరాల్లో ఉల్లి పంట సాగు జరిగినా భారీ వర్షాలు, వరదల వల్ల పంట దెబ్బతింది. దీంతో మార్కెట్ లో ఉల్లి కొరత ఏర్పడింది.
ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నా ఆయా రాష్ట్రాల్లో సైతం ఈ సంవత్సరం పంట దిగుబడి తక్కువగానే ఉందని తెలుస్తోంది. రోజురోజుకు రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ రేపటినుంచి సబ్సిడీ ధరకు ఉల్లి పంటను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లలో కిలో 40 రూపాయల చొప్పున ఉల్లి పంటను విక్రయించనున్నారు.
అయితే గతేడాది కిలో 25 రూపాయలకే ఇచ్చిన జగన్ సర్కార్ ఈ ఏడాది ఏకంగా 40 రూపాయలకు విక్రయిస్తూ ఉండటం వల్ల ప్రజలు సబ్సిడీ ఉల్లి రేటు సైతం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడుతున్నారు. ఉల్లి ధరలను మరింత తగ్గిస్తే బాగుంటుందని కోరుతున్నారు.