AP Political Survey Controversy: తాజాగా ఏపీలో ఒక సర్వే హల్చల్ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పుంజుకుందని ఆ సర్వే స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఐటీ నిపుణులతో ఈ సర్వే చేసినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో అన్నది తెలియడం లేదు. ఎందుకంటే ఆ సర్వేను ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. కానీ అదే సర్వేను పట్టుకొని కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రంగంలోకి దిగడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 18 నెలలు అవుతుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనలేదు. అటువంటి నేత వచ్చి ఇప్పుడు ఈ సర్వే గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే గత ఐదేళ్లలో ఇటువంటి సర్వేలు చాలా చూశాం కూడా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు ఇచ్చిన సర్వే సంస్థలు.. ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడు కూడా అటువంటి ఫేక్ ప్రచారం చేస్తున్నారు అన్నది ఒక అనుమానం.
ఐదేళ్ల పాటు అటువంటి సర్వేలే
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు సర్వే సంస్థలన్నీ అప్పటి అధికారపక్షానికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి మాత్రం 25 కు 25 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని చెప్పేవి. కనీసం ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ ఫలితాలను వెల్లడించాయి. చివరి వరకు అవే తరహా ఫలితాలు ఇచ్చేవి సర్వే సంస్థలు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. అప్పటినుంచి ఈ సర్వేలపట్ల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా హైదరాబాద్ ఐటీ నిపుణుల సర్వే ఒకటి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానిని పట్టుకొని కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని వైసీపీ సీనియర్లు చెబుతున్నారు. అయితే గత ఏడాది కాలంగా కనిపించని నేతలు సైతం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండడం మాత్రం గమనార్హం.
ఆ స్థాయి వ్యతిరేకత ఉందా?
ఏపీలో( Andhra Pradesh) ఒకవైపు అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంకోవైపు సంక్షేమ పథకాలు క్రమ పద్ధతిలో అమలవుతూ సాగుతున్నాయి. ఉద్యోగాల కల్పన జరుగుతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అమరావతి నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏకకాలంలో ఇన్ని పనులు చేస్తున్న క్రమంలో ప్రజల నుంచి సంతృప్తి కనిపిస్తోంది. ఉద్యోగులు ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారు. ఇటువంటి తరుణంలో కూటమి పట్ల భారీ ప్రజా వ్యతిరేకత ఏది కనిపించడం లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 31 అసెంబ్లీ సీట్లు మాత్రమే కూటమి తిరిగి నిలబెట్టుకుంటుందట. మిగతా చోట్ల ఆ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదట. కానీ ఇంతటి ఏకపక్ష ఫలితాలను తేల్చేసిన ఆ సర్వే సంస్థ తీరుపై అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ప్రభుత్వం పై బురదజల్లేందుకు.. కూటమి పార్టీల బలం తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నం గా విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు. మున్ముందు ఇలాంటి సర్వే ఫలితాలు వస్తూనే ఉంటాయని చెబుతున్నారు.