YS Jagan : ఏపీలో ( Andhra Pradesh)రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి పార్టీలు పావులు కదుపుతున్నాయి. జగన్ సైతం ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఢిల్లీ వెళ్ళిన మంత్రి లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఆయన నుంచి కీలక సూచనలు తీసుకున్నారు. 8 నెలల కూటమిపాలనపై ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్ ఇప్పటినుంచి రాజకీయ వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నారు. అందుకే ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు, మొన్న టిడిపి కోసం పనిచేసిన వ్యూహకర్త శాంతన్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మార్చి 12న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా జరపాలన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అదే రోజు నుంచి శాంతన్ సేవలు వినియోగించుకోవాలని ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* అధికారానికి కూత వేటు దూరంలో
2014లో అధికారానికి కూత వేటు దూరంలో ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). 67 అసెంబ్లీ సీట్లతో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. అందుకే 2019 ఎన్నికలకు పకడ్బందీ ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు పనిచేస్తున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం తో ఒప్పందం చేసుకున్నారు. అదే టీంలో రుషిరాజ్ సింగ్ తో పాటు శాంతన్, రాబిన్ శర్మ సహచరులుగా ఉండేవారు. వీరందరి కలయికతో ఏపీలో వైసీపీకి తిరుగులేని వ్యూహాలు అందించగలిగారు ప్రశాంత్ కిషోర్. 2019లో వైసిపి ఘన విజయం సాధించడంతో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం పేరు మార్మోగిపోయింది.
* రాజకీయ నేతగా ప్రశాంత్ కిషోర్
2019 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) క్రమేపి రాజకీయ వ్యూహకర్త వృత్తి నుంచి తప్పుకున్నారు. స్వరాష్ట్రం బీహార్లో పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సేవలు అందించగా.. రాబిన్ శర్మ, శాంతన్ నేతృత్వంలోని షో టైం కన్సల్టెన్సీ సేవలందిస్తూ వచ్చింది. అయితే ఈ ఎన్నికల ముంగిట ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి సలహాలు,సూచనలు అందించారు. నేరుగా తాడేపల్లికి వచ్చి చంద్రబాబుతో మంతనాలు జరిపారు. అదే సమయంలో టిడిపికి అనుకూల ప్రకటనలు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అటు ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి మార్మోగిపోయింది. అదే సమయంలో రాబిన్ శర్మ, శాంతాన్ నేతృత్వంలోని షో టైం కన్సల్టెన్సీ పేరు కూడా బయటకు వచ్చింది.
* 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
అయితే 2029 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) భావిస్తున్నారు. అందుకు సరైన రాజకీయ వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐప్యాక్ సేవలు అందిస్తోంది. తెలుగుదేశం పార్టీకి షో టైం కన్సల్టెన్సీ ఉంది. ఈ తరుణంలో షో టైం కన్సల్టెన్సీ లో పనిచేస్తున్న శాంతాన్ వైసీపీకి సేవలు అందించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ ముఖ్యులను టిడిపిలోకి తీసుకురావడం, టిడిపి నేతలను జనసేన, బిజెపి నుంచి పోటీ చేయించడంలో శాంతన్ పాత్ర ఉన్నట్లు సమాచారం. అదే కూటమి సక్సెస్ అయ్యేందుకు కారణం గా భావిస్తున్నారు. అందుకే అదే శాంతాన్ తో వైసీపీ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. వైసిపి ఆవిర్భావ తేదీ మార్చి 12 నుంచి ఆ పార్టీ కోసం శాంతన్ రంగంలోకి దిగుతారని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.