YS Jagan : ఏపీలో ఇప్పుడు వింత పరిస్థితి. ప్రశ్నించేవారంతా ప్రత్యర్థులు. ప్రత్యర్థి పార్టీ వారుగా లెక్కలు కడుతున్నారు. సమస్యకు మూలం ఎక్కడ ఉందో గుర్తించాల్సింది పోయి.. సమస్యను లెవనెత్తిన వాడిని బాధితుడిగా మార్చేస్తున్నారు. బాధ పెడుతున్నారు. దీంతో చాలామంది బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాయలసీమలో వెంకటసుబ్బారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సీఎం జగనే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. జగన్ కు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా…ఒక పాలకుడిగా , పాలనా వైఫల్యాలకు బాధ్యుడుగా ఆయన మిగులుతున్నారు. రాయలసీమ, అందునా తన సొంత రెడ్డి సామాజికవర్గం అంచనాలకు అందుకోని రీతిలో పాలన సాగిస్తున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నడిచారు రాయలసీమ వాసులు. రెడ్డి సామాజికవర్గం వారు అయితే ఏకపక్షంగా మద్దతు పలికారు. తండ్రికి తగ్గ తనయుడు, ఆపై తండ్రి లేని పిల్లాడు, బాధించబడ్డాడు కాబట్టే చక్కగా పాలిస్తాడు అని భ్రమించారు. కానీ అధికారంలోకి వచ్చాక తన నైజాన్ని చూపించారు. తన వారంటే.. తన వెన్నంటి ఉండే ఆ నలుగురు అనుకున్నారు. రాయలసీమలో తనపై ఆశలు పెట్టుకున్న రెడ్డి సామాజికవర్గం వారు కాదనుకున్నారు. వారికేంటి బతికేస్తారులే అని భావించారు. ఏం చేయకున్నా తన వెంట నడుస్తారులేనన్న ధీమాకు వచ్చారు. కానీ నిలువెత్తూ మోసాన్ని గ్రహించారు. కొందరు దూరం జరిగిపోతున్నారు. మోసపోయామని భావించి.. ఏ మార్గం లేని వెంకట సుబ్బారెడ్డిలాంటి వారు మాత్రం బలవన్మరణమే శరణ్యమన్న నిర్ణయానికి వస్తున్నారు. అయితే నేరుగా సీఎం జగన్ పేరు రాసి మరి ప్రాణం తీసుకుంటున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
పాలనలో అన్నివర్గాల వారికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. సంక్షేమంలో అందరికీ భాగస్థులను చేయాలి. కానీ దురదృష్టవశాత్తూ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కింది వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందడం లేదు. చేసిన వాటికి ప్రతిఫలం లభించడం లేదు. దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. భూముల రీసర్వే ప్రక్రియ వంటివి అక్కరకు రావడం లేదు. రాయలసీమలో రెడ్డి సామాజికవర్గం రైతుల ఆత్మహత్యలకు భూ సమస్యలే కారణమని తెలిసినా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. స్వాంతన కల్పించడం లేదు. నమ్ముకున్న ప్రభుత్వం, పాలకుడు పట్టించుకోకపోవడంతో నైరాశ్యంతో, మనోవేధనతో ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందునా రెడ్డి సామాజికవర్గం వారే సమిధులుగా మారుతుండడం విచారకరం.