AP Politics: ఏపీలో ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల అధినేతలపై రాళ్లదాడి జరుగుతోంది. అయితే అది నిజంగా జరుగుతోందా? లేకుంటే తమకు తామే చేయించుకుంటున్నారా? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. నిజంగా దాడి జరుగుతోందని సొంత పార్టీ శ్రేణులు చెబుతుండగా.. సానుభూతి కోసమే అంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగింది. ఆ ఘటన మరవక ముందే పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై కూడా రాళ్లదాడి వెలుగు చూసింది. దీంతో ఎమోషనల్ పాలిటిక్స్ స్పష్టంగా బయటకు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో విపక్షనేతగా ఉన్న జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. శ్రీనివాసరావు అనే నిందితుడు పట్టుబడ్డాడు. గత ఐదు సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ కేసు విచారణ సవ్యంగా జరగలేదు. బాధితుడిగా ఉన్న జగన్ సైతం కోర్టుకు హాజరు కాలేదు. అత్యున్నత దర్యాప్తు సంస్థ కుట్ర కోణం లేదని తేల్చినా.. ఇంకా లోతైన దర్యాప్తు కావాలని జగన్ పట్టుబట్టారు. దీంతో ఒక రిమాండ్ ఖైదీ ఐదు సంవత్సరాల పాటు జైలులో ఉండిపోవడం రికార్డే. అయితే ఈ కేసు నుంచే.. తాజా కేసులో ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి మాదిరిగా సానుభూతి కోసమే జగన్ తనకు తాను దాడి చేయించుకున్నారని ప్రత్యర్ధులు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ రాళ్ల దాడికి సంబంధించి ఎమోషనల్ రాజకీయాలు ఎన్నికల వరకు కొనసాగనున్నాయి. దీనికి పుల్ స్టాప్ పడాలంటే దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలి. అయితే జగన్ పై దాడి చేసినప్పుడు భద్రత వలయం ఉంది. పోలీసుల నిఘా ఉంది. పైగా విజయవాడ నగరంలో జరగడంతో చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. నిందితులను ఎలాగైనా పట్టుకోవచ్చు. కానీ ఇప్పటివరకు ఆచూకీ కనుక్కోలేకపోయారు. అటు చంద్రబాబు సభలో కూడా ఆయనపై రాయి దూసుకొచ్చింది. వేలాదిమంది కార్యకర్తలు, పోలీసు భద్రత ఉన్నా ఆగంతకులు రాయి విసరగలిగారు. అటు పవన్ పై సైతం రాయితో దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు. దాడి చేసింది ఎవరో గుర్తించగలిగే పరిస్థితి ఉంది. అయినా సరే ఈ మూడు ఘటనల్లో నిందితులు పట్టుబడలేదు. సరిగ్గా సానుభూతి కోసమేనని ప్రచారం జరుగుతున్న వేళ.. రాళ్ల దాడి సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మే 11 వరకు ఈ రాళ్ల దాడి ఎపిసోడ్లు ఎన్నో కొనసాగుతాయి. అయితే ఒకవేళ సానుభూతి కోసమే చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. ఇప్పటికే ఈ ఘటనలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. నిజంగా ఫుల్ స్టాప్ పడాలంటే నిందితులు పట్టుబడాల్సిందే. కానీ ఆ నిందితులు పట్టుబడతారా? పట్టుబడే ఛాన్స్ ఉందా? అంటే సమాధానం దొరకని పరిస్థితి.