Srisailam Dam Plunge Pool: తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం జలాశయం ప్రమాదంలో పడిందా? ఈ జలాశయానికి సంబంధించి అక్కడి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పెను విపత్తు తప్పదా? దీనికి అవును అని సమాధానం చెబుతున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. ఎంతో ఉదాత్తమైన ఆశయంతో నిర్మించిన ఈ జలాశయం ప్రమాదంలో ఎందుకు పడింది? ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే జరిగే నష్టం ఏమిటి? ఈ అంశాలపై ప్రత్యేక కథనం..
కృష్ణానది ప్రవాహం ఆధారంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం జలాశయం నిర్మించారు. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలం జలాశయంలో నీటి ద్వారా విద్యుతును ఉత్పత్తి మాత్రమే కాకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేస్తారు. ఈ జలాశయం ఆధారంగా వేలాది ఎకరాలలో పంటలు పండుతున్నాయి. రెండు కొండల మధ్య శ్రీశైలం జలాశయాన్ని నిర్మించారు. ఇక్కడ కృష్ణానది నీరు గ్రావిటీ ఆధారంగా కిందికి సరఫరా అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టులో నీరు శ్రీశైలానికి.. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సరఫరా అవుతుంది.. శ్రీశైలం నిండితే రెండు తెలుగు రాష్ట్రాలలో పంటలకు ఇబ్బంది ఉండదు. పైగా నాగార్జునసాగర్ కు ప్రధాన నీటి వనరుగా శ్రీశైలం జలాశయం ఉంది. శ్రీశైలం జలాశయం ఒకప్పుడు లోతుగా ఉండేది. అయితే గత కొంతకాలంగా ఈ జలాశయంలో పూడిక పేరుకు పోతోంది. ఈ పూడిక వల్ల జలాశయం నిల్వనీటి సామర్థ్యం తగ్గిపోతుంది. వర్షాకాలంలో వరదలు వచ్చినపుడు ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. మార్చి నెల వచ్చేసరికి ప్రాజెక్టు నిండుకుంటున్నది. దీనివల్ల వేసవికాలంలో తాగునీటికీ ఇబ్బంది ఏర్పడుతోంది. అందువల్లే శ్రీశైలం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించాలని ఎప్పటినుంచో విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీరు విడుదల చేసే క్రమంలో డ్యామ్ గేట్లు తెరుస్తారు. ఆ సమయంలో నీళ్లు సరఫరా అయ్యే చోట భారీగా గొయ్యి ఏర్పడింది. దీన్ని నీటిపారుదల శాఖ పరిభాషలో “ప్లంజ్ పూల్” అని పిలుస్తుంటారు. వాస్తవానికి ఈ గుంత దశాబ్దల క్రితమే మొదలైంది. ఇప్పుడు ఏకంగా తాటి చెట్టు అంత పొడుగు లోతు విస్తరించింది. దీనివల్ల ప్రాజెక్టు పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గుంత సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తల బృందం కొద్ది రోజుల క్రితం నుంచి సర్వే చేస్తోంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేనిపక్షంలో జలాశయం పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ జలాశయం పునాదులు గనుక కదిలిపోతే అప్పుడు జరిగే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. పరిస్థితి అక్కడిదాకా వచ్చే కంటే ముందే.. మేల్కోవడం మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కృష్ణా నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. ఆ సమయంలో నీరు అధికంగా రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి నీరు బయటికి వచ్చింది. నాటి ఘటనలో కర్నూలు జిల్లా మొత్తం మునిగిపోయింది. నష్టం తీవ్ర స్థాయిలో వాటిల్లింది. ఆ తర్వాత ఆ స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు రాకపోయినప్పటికీ.. ప్రాజెక్టు పైనుంచి వచ్చే నీటి వల్ల ఏర్పడిన ఫ్లంజ్ పూల్ కు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైనది. కాకపోతే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో ఉండడంతో ఎక్కువగా ఆ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని తెలుస్తోంది.