Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: కడప ఇలాకాలో గెలిచేది వారే.. గ్రౌండ్ రిపోర్ట్

AP Elections 2024: కడప ఇలాకాలో గెలిచేది వారే.. గ్రౌండ్ రిపోర్ట్

AP Elections 2024: కడపలో వైసీపీ పరిస్థితి ఏంటి? గత రెండు ఎన్నికల మాదిరిగా స్వీప్ చేస్తుందా? ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా?ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపజయం నాటి నుంచి.. కడప జిల్లా చర్చనీయాంశంగా మారింది. షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ, వివేకానంద రెడ్డి హత్య అంశం, టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టడం తదితర కారణాలతో వైసిపి వెనుకబడిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అనూహ్యంగా కడప జిల్లాలో టిడిపి పుంజుకుందన్న సంకేతాలు వస్తున్నాయి. గత రెండు ఎన్నికల కంటే.. ఈసారి టిడిపి శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.ముస్లిం, క్రిస్టియన్లలో ఘనమైన మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ వైపు ఆ రెండు వర్గాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ బెడద ఉంటుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

గత ఐదు సంవత్సరాలుగా పులివెందుల మినహా మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి పెద్దగా కనిపించలేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. ఇప్పుడు ఇవే కీలకంశాలుగా మారాయి. కడప ప్రజలు బాహటంగానే తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరులో టిడిపికి మొగ్గు కనిపిస్తోంది. కమలాపురం జమ్మలమడుగులో హోరాహోరీ ఫైట్ ఉంటుంది. బద్వేలులో వైసీపీకే ఛాన్స్ కనిపిస్తోంది. ఓవరాల్ గా గతం కంటే టిడిపి పుంజుకున్నట్లు స్పష్టమౌతోంది.

కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాధవి రెడ్డి, వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ బాషా పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో అంజాద్ బాషా గెలుపొందుతూ వచ్చారు. ఎన్నికల్లో కడప ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి అఫ్జల్ ఖాన్ అనే ముస్లిం అభ్యర్థి బరిలో దిగారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడం, మైనారిటీ అభ్యర్థి కావడం, వైసీపీ ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ టిడిపి అభ్యర్థికి ఎడ్జ్ కనిపిస్తోంది.

ప్రొద్దుటూరులో టిడిపి వైపు మొగ్గు ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయనపై అవినీతి,అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. టిడిపి బీసీ నేత హత్యతో.. బీసీ సామాజిక వర్గాలు వైసిపి పై వ్యతిరేకతతో ఉన్నాయి. ఎక్కువమంది ప్రజలు టిడిపి వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు సైతం తేల్చి చెబుతున్నాయి.

ఇక జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్న కమలాపురంలో కూడా ఈసారి ఈజీ కాదని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతం మాదిరిగా ఇక్కడ వైసిపికి వన్ సైడ్ లేదు. చైతన్య రెడ్డి రూపంలో టిడిపి బలమైన అభ్యర్థిని బరిలోదించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గెలుపు సునాయాసమే. అయితే మెజారిటీ మాత్రం గణనీయంగా తగ్గుతుంది. ఈ నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రభావం చూపనుంది. టిడిపి అభ్యర్థి బీటెక్ రవి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యాలయాల ప్రారంభంతో పాటు వైసిపి నుంచి చాలామందిని టిడిపిలోకి రప్పిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ కలవాలంటే మధ్యలో అవినాష్ రెడ్డి ఉంటారన్న అపవాదు ఉంది. ఈసారి పులివెందుల ప్రజలు సైలెంట్ గా ఓటు వేస్తారు అన్న అనుమానాలు ఉన్నాయి.

మైదుకురులో సైతం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. టిడిపి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ పై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అవినీతి ఆరోపణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇది టిడిపికి కలిసి వచ్చే విషయం.

జమ్మలమడుగులో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బిజెపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న భూపేష్రెడ్డి కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ సైతం గట్టి ఫైట్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం బద్వేలులో వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. కూటమి అభ్యర్థిగా బిజెపి నుంచి బొజ్జ రోషన్న పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి సుధా మరోసారి బరిలో దిగారు. అయితే ఇక్కడ వైసిపికి గట్టిపట్టు ఉంది. అందుకే ఆ పార్టీకే మొగ్గు కనిపిస్తోంది. మొత్తానికి అయితే కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా గట్టి ఫైట్ ఉండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular