Guntur West
Guntur West: ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో.. చాలాచోట్ల మహిళలు పోటీ చేస్తున్నారు. వైసిపి తో పాటు కూటమిలోని మూడు పార్టీలు మహిళా అభ్యర్థులను రంగంలో దించాయి. కానీ మహిళా అభ్యర్థులు ముఖాముఖిగా పోటీ చేస్తున్న నియోజకవర్గ ఒకటే ఉండడం విశేషం. అది గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. ఇతర నియోజకవర్గాల్లో పురుష అభ్యర్థులపై మహిళలు, మహిళా అభ్యర్థులపై పురుషులు పోటీ చేస్తున్నారు. కానీ గుంటూరు వెస్ట్ లో వైసీపీ తరఫున మంత్రి విడుదల రజిని, టిడిపి నుంచి పిడుగురాళ్ల మాధవి బరిలో దిగనున్నారు. దీంతో ఈ నియోజకవర్గ రాష్ట్రస్థాయిలోనే హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులు.. పురుషులతో తలపడుతున్నారు. పత్తికొండలో కేఈ శ్యాం బాబుతో కంగాటి శ్రీదేవి, పాతపట్నంలో మామిడి గోవిందరావు తో రెడ్డి శాంతి, శృంగవరపుకోటలో కడుబండి శ్రీనివాస రావు తో కోళ్ల లలిత కుమారి, పలాసలో సిదిరి అప్పలరాజుతో గౌతు శిరీష, నగిరిలో గాలి భాను ప్రకాష్ తో ఆర్కే రోజా, మంగళగిరిలో నారా లోకేష్ తో మురుగుడు లావణ్య, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తో వంగా గీత వంటి ఎంతోమంది మహిళా నేతలు పోటీపడుతున్నారు. అయితే గుంటూరు వెస్ట్ లో మాత్రం ఇద్దరు మహిళా నేతలు ముఖాముఖిగా తలపడుతున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే వారి భర్తలు వేరే సామాజిక వర్గాలకు చెందినవారు. ఇద్దరు బీసీ నేతలే కావడంతో అక్కడ హోరాహోరీ ఫైట్ నెలకొంది.
గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన విడదల రజిని గెలుపొందారు. మంత్రివర్గ విస్తరణలో ఆమె పదవి దక్కించుకున్నారు. అయితే ఈసారి చిలకలూరిపేటలో బరిలో దిగితే ఆమెకు కష్టమేనని తేలింది. సర్వే నివేదికలు అలాగే రావడంతో జగన్ ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. దీంతో టీడీపీ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అక్కడ పిడుగురాళ్ల మాధవిని బరిలో దించింది.డాక్టర్ కావడం, ఆపై ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఇద్దరి మధ్య ఫైట్ హోరాహోరీగా సాగనుంది. అయితే ఇక్కడ రెండు పార్టీలకు అసమ్మతి సెగ ఉంది. రెండు పార్టీల తరఫున చాలామంది ఆశావాహులు టికెట్లు ఆశించారు. కానీ అనూహ్యంగా అటు వైసిపి విడదల రజినీకి, ఇటు టిడిపి పిడుగురాళ్ల మాధవికి టికెట్ కేటాయించడంతో ఇరు పార్టీల శ్రేణులు అంటీముట్టనట్లుగా ఉన్నారు ఉన్నారు.