https://oktelugu.com/

Cheepurupalli: చీపురుపల్లి రివ్యూ: బొత్స పై కళాకు అంత ఈజీ కాదు..

పేరుకే బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అభ్యర్థి. కానీ అంత మేనల్లుడు చిన్న శ్రీను చూసుకుంటారు. వాస్తవానికి చీపురుపల్లి అసెంబ్లీ సీటును మేనల్లుడికి విడిచిపెట్టి.

Written By:
  • Dharma
  • , Updated On : April 12, 2024 12:29 pm
    Cheepurupalli

    Cheepurupalli

    Follow us on

    Cheepurupalli: ఏపీలో కీలక నియోజకవర్గాల్లో చీపురుపల్లి ఒకటి. సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండటమే అందుకు కారణం. 2004 నుంచి ఆయన వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు ఆ నియోజకవర్గంలో. 2014లో మాత్రం ఆయనపై మాజీ మంత్రి కిమిడి మృణాళిని గెలిచారు. కానీ త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్న నాయకుడు కూడా ఆయనే. ఆ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో బొత్స బ్యాచ్ ను జగన్ రప్పించుకున్నారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి టిక్కెట్ కాదు.. విజయనగరం జిల్లా నే బొత్స కు కట్టబెట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లను గెలిపించుకున్న బొత్స తన హవాను చాటుకున్నారు. అటువంటి బొత్సను దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు భావించారు. కళా వెంకట్రావును ఆయనపై ప్రయోగించారు. దీంతో చీపురుపల్లిలో గట్టి ఫైట్ నడుస్తోంది.

    పేరుకే బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అభ్యర్థి. కానీ అంత మేనల్లుడు చిన్న శ్రీను చూసుకుంటారు. వాస్తవానికి చీపురుపల్లి అసెంబ్లీ సీటును మేనల్లుడికి విడిచిపెట్టి.. రాజ్యసభకు వెళ్ళిపోవాలని బొత్స భావించారు. కానీ చిన్న శ్రీను ఆగడాలతో క్యాడర్ విసిగి వేసారిపోవడం, ఆయన పోటీ చేస్తే సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశం ఉండడంతో.. జగన్ చివరి నిమిషంలో బొత్సను రంగంలోకి దించారు. ప్రస్తుతం బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి విశాఖ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆమెకు పరిస్థితి అంత ఈజీ కాదు. అందుకే బొత్స విశాఖ లోక్ సభ సీట్ పై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇదే అదునుగా చంద్రబాబు చీపురుపల్లిలో కళా వెంకట్రావు రంగంలోకి దించారు. అప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న మృణాళిని కుమారుడు నాగార్జునను కాదని.. ఆయన పెదనాన్న కళా వెంకట్రావును అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగార్జున పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. క్యాడర్ మాత్రం కళా వెంకట్రావు వెంట నడుస్తోంది. ఇన్నాళ్లు సీనియర్ అండలేదని బాధపడిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైసీపీలో కొనసాగుతున్న సీనియర్లు.. ఇప్పుడు టిడిపి బాట పడుతున్నారు. కళా వెంకట్రావు వెంట అడుగులు వేస్తున్నారు.

    చీపురుపల్లి నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. పురుషులు, మహిళలు దాదాపు సమానమే. నాలుగు మండలాల్లో 120 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. స్థానిక సంస్థలను ఏకపక్షంగా వైసీపీ గెలుచుకుంది. చివరకు జడ్పిటిసి స్థానాలను సైతం ఏకగ్రీవం చేసుకుంది. అయితే వైసీపీలో ఇప్పుడు నాయకులు ఎక్కువ కావడంతో ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో పెద్ద ఎత్తున టిడిపిలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మొరకముడిదాం మండలంలో కీలక నేతలు టిడిపి బాటపడుతున్నారు. దివంగత ఎమ్మెల్యే కోట్ల సన్యాసప్పల నాయుడు కుటుంబం టిడిపిలో చేరింది. ఇక్కడ జనసేనకు కూడా బలం ఉంది. ఆ పార్టీ నుంచి సైతం కళా వెంకట్రావుకు సహకారం అందుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకునే కళా వెంకట్రావు చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు. మొన్నటి వరకు ఆయన ఇన్చార్జిగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కానుంది. అదే జరిగితే కొత్త నియోజకవర్గాన్ని కళా వెంకట్రావు ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈసారి చీపురుపల్లిలో పట్టు బిగిస్తే.. రాజకీయంగా కంటిన్యూ కావచ్చు అని.. తమ కుటుంబానికే చీపురుపల్లి ఉంటుందని కళా వెంకట్రావు ముందు చూపుతో వ్యవహరించారు. అయితే అభ్యర్థి పెదనాన్న అయినా.. రేపు వారసుడుగా ఆయన కుమారుడు ఎంట్రీ ఇస్తారని నాగార్జున అనుమానిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. హై కమాండ్ పెద్దలు మాత్రం నాగార్జునను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.