RK Weekend Comment: జగన్, షర్మిల మధ్య విభేదాలు మరింత పెరిగిపోయాయి. ఆమె వివేకానంద రెడ్డి మరణం గురించి ప్రశ్నించినా, ఇంకా ఆ విషయాల గురించి బయటపెట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల మధ్య విభేదాల కారణం భారతి రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని భారతి రెడ్డే కాపాడుతున్నారు.. జగన్ వదిలిన బాణం ఆయనకే బల్లెం లాగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు శత్రువులుగా ఉండేవారు. ఇప్పుడు ఆ జాబితాలోకి షర్మిల చేరిపోయారు.. ఇవీ ఆంధ్రజ్యోతి పత్రికలో దాని ఓనర్, కం జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో గుళికలు..
గతవారం తెలంగాణ రాజకీయాల గురించి కొద్దో గొప్పో ప్రస్తావించిన రాధాకృష్ణ.. ఈ వారమైతే ఏకంగా ఏపీ రాజకీయాలనే ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని.. (అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సుద్ధ పూస అని మా ఉద్దేశం కాదు. ఆయన పేదలకు ప్రతినిధి అని మేము చెప్పడం లేదు. ) రాధాకృష్ణ రాసుకుంటూ పోయారు. షర్మిల తన కుమారుడి నిశ్చితార్థ, వివాహ ఆహ్వాన పత్రిక అందించడం నుంచి మొదలుపెడితే భారతి రెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్నంతవరకు ఇలా ప్రతి అంశాన్ని తనకి తెలిసిన సమాచారంతో రాసుకుంటూ పోయారు.. కానీ ఇదే రాధాకృష్ణ నందమూరి కుటుంబంలో, నారా కుటుంబంలో ఉన్న విభేదాల గురించి రాస్తారా? మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వర్ధంతి జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి తొలగించలేదా? ఆ దృశ్యాలు మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చాయి కదా. రాధాకృష్ణ చూపించక పోయినంతమాత్రాన, తన పత్రికలో రాయనంత మాత్రాన అవి నిజాలు కాకుండా పోతాయా? గత ఏడాది ఇదే సమయానికి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభానికి వెళ్ళిన నందమూరి తారకరత్న అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. టిడిపిలోనే ఉన్న అతడి కుటుంబానికి చంద్రబాబు ఏం న్యాయం చేశాడు? జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పై టిడిపి అనుకూల సోషల్ మీడియా దాడి నిజం కాదా? బాలకృష్ణ అభిమానులు చేస్తున్న విమర్శల మాటేమిటి? అసలు మొదట ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ మీద నిషేధం ఎందుకు విధించారు? తర్వాత ఎందుకు ఎత్తేశారు? వీటి మీద రాధాకృష్ణ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడు?
కొద్దిరోజులుగా నారా లోకేష్ పెద్దగా కనిపించడం లేదు.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్లాడు? భారతి రెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిన రాధాకృష్ణకు… లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తనను, రామోజీరావు టార్గెట్ చేస్తున్నాడనివా చెప్పిన రాధాకృష్ణ.. అసలు విషయం మర్చిపోయారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అనేవారు రాజకీయ నాయకులు. వారికి వేరువేరుగా పార్టీలు ఉన్నాయి. పైగా వారు ఏపీలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నారు కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి.. కచ్చితంగా వారిని విమర్శిస్తారు. వారిని తన ప్రత్యర్థులుగా భావిస్తాడు.. మరి ఈ జాబితాలోకి వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు ఎందుకు చేరుతారు? అంటే పత్రిక ముసుగులో, పాత్రికేయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామని.. పసుపు అనుకూల రాతలు రాస్తున్నామని రాధాకృష్ణ ఒప్పుకున్నట్టేనా?
జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో తన చెల్లెలికి వాటా ఇవ్వలేదని.. ఆయన కోసం పాదయాత్ర చేస్తే కనీసం ప్రాధాన్యం ఇవ్వలేదని రాసుకొచ్చిన రాధాకృష్ణ.. అంత ఇందులో నిజం ఉండొచ్చు.. ఉండకపోనూ వచ్చు. ఒకవేళ షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆ స్థాయిలో విభేదాలుంటే ఆమె కుమారుడి నిశ్చితార్థానికి ఎందుకు వెళ్తాడు? అక్కడ జగన్ ఉన్నది కొన్ని నిమిషాలు అనే మాట ఇక్కడ తర్కానికి నిలబడదు. అంతే కాదు బిజెపి నేతలకు కోపం వస్తుందని జగన్మోహన్ రెడ్డి షర్మిళను ఇంట్లోకి రావద్దని హెచ్చరించాడట. అలా చేస్తే ఇంటి గుమ్మం ముందు పెళ్లి కార్డు పెట్టి వెళ్తానని షర్మిల హెచ్చరించిందట. దానికి వెంటనే జగన్ భయపడిపోయి.. వెంటనే షర్మిల కొడుకు నిశ్చితార్థానికి వచ్చాడట. ఇదే వ్యాసంలో షర్మిల జగన్ కంటే జగన్ జగ మొండి అని రాసుకొచ్చిన ఆర్కే.. తన ఇంటి వద్దకు జగన్ రావొద్దు అంటే షర్మిల ఎందుకు వెళ్తుంది? అప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాలేదు. అలాంటప్పుడు బిజెపి పెద్దలకు ఎందుకు కోపం వస్తుంది? ఇలాంటి లాజిక్ లేని రాతలు ఈ వారం కొత్త పలుకులో బోలెడు. వైయస్ వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించిన కేసును దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి.
పదేపదే వైయస్ వివేకానంద రెడ్డి మరణాన్ని ప్రస్తావించే రాధాకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ బతికున్నప్పుడు.. అది కూడా ఆయన చివరి రోజుల్లో చంద్రబాబు గురించి ఏం మాట్లాడాడో ఎందుకు ప్రస్తావించడు? సీనియర్ ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు గురించి ఎందుకు చెప్పడు? షర్మిలపై వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారని, ఆమెకు జరిగిన మొదటి పెళ్లి గురించి మాట్లాడుతున్నారని వాపోయిన రాధాకృష్ణ.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడానికి రేణు దేశాయ్ తో ఇంటర్వ్యూ నిర్వహించలేదా? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననాని కి పాల్పడలేదా? అంటే ఇప్పుడు షర్మిల.. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంది కాబట్టి రాధాకృష్ణ వెనకేసుకొస్తున్నాడు. గతంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు తన పత్రికలో సింగిల్ వార్త రాశాడా? అప్పట్లో షర్మిల వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తలు రాయలేదా? పాపం రాధాకృష్ణ గతంలో తను రాసిన రాతలు మర్చిపోయినట్టున్నాడు.
ఇది సోషల్ మీడియా కాలం సార్.. ప్రతీది నిక్షిప్తమయ్యే ఉంది. అన్నట్టు ఆ మధ్య వివేకానంద రెడ్డి కూతురు లేదా భార్య టిడిపిలోకి వెళ్తున్నారు అని రాసిన రాధాకృష్ణ…సడన్ గా కాంగ్రెస్ పార్టీ వారు పోటీ చేస్తారు.. అది కూడా అవినాష్ ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు చెప్తేనే.. అంటే చంద్రబాబు వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వలేదా? లేక చంద్రబాబు ను నమ్మలేక వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా? దీనికి రాధాకృష్ణనే సమాధానం చెప్పాలి.