RK Kotha Paluku: ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో తన ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ వర్తమాన రాజకీయాలపై తన మార్క్ విశ్లేషణ చేస్తారు. అందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనే విషయాలను పక్కనపెడితే.. ఏదో ఒక సమాచారం అయితే అందులో ఉంటుంది. అందుకే ఆర్కే రాసే కొత్త పలుకుకు కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది.. ఇక ఈ ఆదివారం రేవంత్ రెడ్డి నామస్మరణలో రాధాకృష్ణ తరించిపోయారు. మొన్నటిదాకా హైడ్రా విషయంలో.. ఇళ్ల కూల్చివేతల విషయంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేక కోణంలో తన కొత్త పలుకును ప్రవచించిన రాధాకృష్ణ.. ఇప్పుడు రేవంత్ లో ఫైర్ ఉందని.. ఆయన లోతైన మనిషని చెప్పడం మొదలుపెట్టారు. “నేను గతంలోనే చెప్పాను. రేవంత్ రెడ్డి చాలా లోతైన మనిషని. కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత రాజకీయాలు ఎక్కువ. దానిని ఆ పార్టీ నాయకులు అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు. ఆ పార్టీలో తీసుకునే నిర్ణయాలు గుంభనంగా ఉండవు. అయితే అలాంటి పార్టీలోనూ రేవంత్ రెడ్డి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను అటు భట్టి విక్రమార్క, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించలేని పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి ప్రభుత్వంపై పట్టు పెంచుకున్నారు. పార్టీపై కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని” రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చైర్ ను ఫైర్ లాగా మార్చారని రాస్కొచ్చారు.
కేటీఆర్ అరెస్ట్ అప్పుడే నట
కొత్త పలుకులు రేవంత్ రెడ్డి కి అమాంతం బాహుబలి రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన రాధాకృష్ణ.. కేటీఆర్ అరెస్టుపై కూడా తనదైన జోస్యం చెప్పారు. విదేశీ కంపెనీకి 55 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఇవ్వడాన్ని రాధాకృష్ణ తప్పు పట్టారు. నాడు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ కనుక కేటీఆర్ నిర్ణయానికి నో చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదని.. మంత్రుల మాటలకు ఐఏఎస్ అధికారులు తల ఊపడం సరికాదని స్పష్టం చేశారు. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని స్పష్టం చేసిన రాధాకృష్ణ.. కెసిఆర్ ను ఇప్పుడప్పుడే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయరని పేర్కొన్నారు. “ఒక్క గానొక్క కూతురు పెళ్లి చేయనీయకుండా రేవంత్ రెడ్డి కి కెసిఆర్ అడ్డంకులు కల్పించారు. ఏకంగా అరెస్టు చేయించి జైల్లో వేశారు. రేవంత్ రెడ్డి పై కేసీఆర్ కుటుంబం ఇష్టం సారంగా విమర్శలు చేసింది. ఆరోపణలు గుప్పించింది. వీటన్నింటినీ గుర్తుపెట్టుకున్న రేవంత్ రెడ్డి రాజకీయంగా అమాంతం ఎదిగిపోయారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించారని” రాధాకృష్ణ గుర్తు చేశారు. మొత్తానికి చంద్రబాబు నామస్మరణ నుంచి ఈ వారం రాధాకృష్ణ బయటపడ్డారు. తనలో ఉన్న జర్నలిస్టుని సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. కెసిఆర్ పై ఉన్న తన వ్యక్తిగత ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. రేవంత్ రెడ్డిని వైల్డ్ ఫైర్ లాగా అభివర్ణించి.. ఇక ఆయనకు తిరుగులేదని జోస్యం చెప్పారు.