Government Officers : వైసీపీకి ఫేవర్.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా స్కెచ్.. చంద్రబాబు సీరియస్!

విజయవాడ ఇంకా తీరుకోలేదు. నగరం ఇంకా ముంపు భారీ లోనే ఉంది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా సహాయ చర్యల్లో జాప్యం జరుగుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : September 3, 2024 11:36 am

CM Chandrababu Alert officers

Follow us on

Government Officers :  వరద సహాయ చర్యల్లో జాప్యం జరగాలని వైసిపి భావించిందా? అప్పుడే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అంచనా వేసిందా? అందుకు అస్మదీయ అధికారులను ప్రయోగించిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే ఇంతకంటే హీనం మరొకటి ఉండదు. ఏపీలో వర్షాలు దంచి కొట్టాయి. విజయవాడ నగరంలో బీభత్సం సృష్టించాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా ప్రాంతాలు నీటి వరదలో చిక్కుకున్నాయి.ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ నుండే పాలనను కొనసాగించారు. అక్కడే బస్సులో బస చేశారు. నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. బాధితులకు పునరావాసం, ఆహార పదార్థాల పంపిణీ పై దృష్టి పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కీలక సమీక్ష జరిపారు. అన్ని సవ్యంగా జరిగినా.. బాధితులకు ఆహారం పంపిణీలో ఎందుకు జాప్యం జరిగిందని యంత్రాంగాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ మంత్రి కీలక సమాచారం ఇచ్చారు. కొంతమంది అధికారులు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే ఆహార పదార్థాల పంపిణీలో జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే వారంతా వైసీపీ విధేయ అధికారులు అని తెలియడంతో చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.

* సహాయ చర్యలకు పర్యవేక్షకులుగా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులకు వీఆర్లోకి పంపింది. వారంతా వైసిపి హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. ఐఏఎస్ అధికారులైతే సాధారణ పరిపాలన శాఖకు… ఐపీఎస్ అధికారులు అయితే డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. వారందరినీ ఎటువంటి పోస్టింగులు ఇవ్వకుండా లూపోల్స్ లో పెట్టారు. ప్రస్తుతం వారంతా ఖాళీగా ఉన్నారు. దీంతో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వరద సహాయ ప్రాంతాల్లో అధికారులుగా నియమించాలని కోరారు. అధికారుల కొరత ఉన్న దృష్ట్యా వారిని.. విజయవాడ నగరంలో సహాయ చర్యల పర్యవేక్షణకు అధికారులుగా నియమించారు.

* ప్రత్యేక అధికారులుగా నియామకం
విజయవాడ నగరవ్యాప్తంగా ప్రాంతాలకు.. ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించారు. బాధితులకు సహాయ చర్యలతో పాటు ఆహార పంపిణీ బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నుంచి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆహార పంపిణీ బాధ్యతలను తానే స్వయంగా పర్యవేక్షించారు. అన్ని ప్రాంతాలకు ఆహార పదార్థాలను పంపారు. అయితే సోమవారం నాటికి కొన్ని ప్రాంతాలకు ఆహార పదార్థాలు అందలేదని ఫిర్యాదులు వచ్చాయి. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలను బాధితులు నిలదీసినట్లు వార్తలు వచ్చాయి. సహాయ చర్యల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలపై సంతృప్తి వ్యక్తం అవుతున్న వేళ.. ఉన్నపలంగా ఆహార పంపిణీలో జాప్యం వార్తలపై సీఎం స్పందించారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది అధికారుల తీరుతోనే అలా జరిగిందని ఓ మంత్రి చెప్పుకొచ్చారు. వారంతా వైసిపి అస్మదీయులని చెప్పారు.

* వారందరిపై చర్యలు
అయితే దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వరద బాధితుల సహాయం లోను ఇలాంటి చర్యలకు దిగుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ అధికారులపై ఒక నివేదిక ఇవ్వాలని కోరారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. సహాయ చర్యలు అడ్డుపడుతున్న అధికారుల జాబితా తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రధానంగా ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, సిహెచ్ విజయరావు, రఘువీరారెడ్డి, అదనపు ఎస్పీ జోషి, డీఎస్పీలు సత్యానందం, గోపాలకృష్ణ, శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. వీరి పాత్ర పై నివేదిక రానున్న తర్వాత చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది.