Khammam : ఖమ్మం నగరం లో సహజంగా ఏర్పడిన చెరువులు, కుంటలు, వాగులున్నాయి. కాలక్రమంలో ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. అందువల్లే ఖమ్మం నగరంలో ఈ స్థాయిలో వరద ప్రభావానికి గురైంది. సుందరీ కరణ పేరుతో నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు మాయమైతున్నాయి. గుట్టలు, వాగులు హరించకుపోతున్నాయి. అందువల్లే ఖమ్మం నగరం ఈ స్థాయిలో వరద ప్రభావానికి గురైందని తెలుస్తోంది. ఉదాహరణకు ఖమ్మం నగరానికి రఘునాధపాలెం మండలం ఎగువ ప్రాంతంలో ఉంటుంది. రఘునాథపాలెం చెరువు మీదుగా బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం చెరువుల నుంచి ఖమ్మం లకారం చెరువులోకి వరదనీరు ప్రవహించేందుకు ఫీడర్ చానల్స్ ఉన్నాయి. లకారం నుంచి శివారు ప్రాంతంలో ఉన్న ధంసలాపురం చెరువుకు అలుగు భాగు అనుసంధానమై ఉంటుంది. ధంసాలాపురం కాసారం నిండిన తర్వాత ఆ అలుగు నీరు మున్నేరు వాగులో కలుస్తుంది. అయితే ఈ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నది. నాలాలు మొత్తం ఆక్రమణకు గురికావడంతో వరద నీరు పూర్తిగా తన దిశను మార్చుకుంది. అందువల్లే ఖమ్మం నగరాన్ని ఈ స్థాయిలో వరద నీరు ముంచెత్తింది. ఖమ్మం బైపాస్ రోడ్ లోని సుమారు 40 అడుగుల వెడల్పుతో నాలా ఉండేది. ఇప్పుడు పది అడుగులకు తగ్గిపోయింది. ఫలితంగా వర్షాల వల్ల వరద ఖమ్మం బైపాస్ రోడ్ లోని చైతన్య నగర్ ను ముంచెత్తింది.
అభివృద్ధి పేరుతో..
గత ప్రభుత్వ హయాంలో లకారం ట్యాంక్ బండ్ అభివృద్ధి పేరుతో ఆ చెరువులోకి నీరు ప్రవేశించకుండా ఉండేందుకు చుట్టూ మట్టికట్టలు నిర్మించారు. దీంతో ఆ వరద కాస్త కవి రాజనగర్ ప్రాంతంలోని ఇళ్లను చుట్టుముట్టింది. ఇక మున్నేరుకు ఆనుకొని ఉన్న వెంకటేశ్వర నగర్, సారధి నగర్, పద్మావతి, మంచి కంటి నగర్, బొక్కల గడ్డ ప్రాంతాలలో బఫర్ జోన్ ను ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపట్టారు. కొత్తగా నిర్మాణాలు కూడా సాగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం మున్నేరు 31 అడుగుల మేర ప్రవహించింది. ఆ సమయంలో ఖమ్మంలోని ముంపు ప్రాంతాలు మాత్రమే నీట మునిగాయి. ఎన్నడు కూడా 36 అడుగుల మేర వరద ప్రవాహం రాలేదు. కానీ ఈసారి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదరావడంతో మున్నేరు అకస్మాత్తుగా పెరిగింది. ఫలితంగా చాలా ఇళ్లు నీట మునిగాయి వందల మంది కట్టుబట్టలతో మిగిలారు.
గోళ్ళపాడు ఛానల్ ను మార్చడంతో..
మున్నేరు వరద దిగువ ప్రాంతానికి ప్రవహించేలాగా కాకతీయుల కాలంలో నగరంలో గోళ్లపాడు ఛానల్ నిర్మించారు. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితమే ఆక్రమణకు గురైంది. దానికి పూర్వ వైభవం తీసుకొస్తామని గత ప్రభుత్వ హయాంలో 100 కోట్లు ఖర్చుపెట్టి సుందరీ కరణ పనులు చేపట్టారు. పైన పార్కులు నిర్మించారు. కింద భారీ లోతులో భూగర్భ పైపులు నిర్మించారు . అసలే గొళ్ళపాడు కాల్వ ఉనికి కోల్పోయింది. వెడల్పు కూడా తగ్గిపోవడం.. అసంపూర్తి పనులతో మున్నేరు ప్రవాహం ముందుకు వెళ్లే మార్గం లేకపోయింది. దీంతో వరద నీరు ముంచెత్తింది.