Pawankalyan : పవన్ పై ఫుల్ టైమ్ రాజకీయాలు చేయడం లేదన్న అపవాదు ఉంది. రాజకీయం, సినిమా రంగం.. ఇలా రెండు పడవలపై అడుగులేసి ప్రయాణిస్తున్నారని ఎక్కువ మంది తప్పుపడుతుంటారు. కుహానా మేథావులు, విశ్లేషకులు తరచూ ఇదే మాటను హైలెట్ చేస్తుంటారు. అయితే అడపాదడపా వచ్చినదానికే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మిగతా పక్షాలు ఉనికి కోల్పోతున్నాయి. అదే ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తే ఆ రిజల్ట్ సాలిడ్ గా ఉంటుంది. కానీ సినిమా నా వృత్తి అయితే.. రాజకీయం తన ప్రవృత్తి అని పవన్ తరచూ చెబుతుంటారు. కానీ చాలా మందికి ఇది వినిపించదు. ఎందుకంటే పవన్ పై వారి అభిప్రాయం ఓ మాదిరిగా ఉంటుంది కనుక.
జూన్ 14న వారాహి తొలి విడత యాత్ర అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రారంభమైంది. అదే నెల 30 వరకూ సాగింది. ఐదారు రోజులు విరామం ఇచ్చి రెండో విడత యాత్ర ప్రారంభమైంది. అంటే పవన్ ప్రజల్లో గట్టిగా ఉంటే ఓ మూడు వారాల పాటు ఉన్నారన్న మాట. కానీ ఫుల్ టైమ్ రాజకీయాల్లో ఉండే వారి కంటే ఎక్కువగానే పొలిటికల్ హీట్ ఇచ్చారు. పరిణితి చెందిన నాయకుడిగా తనను తాను తీర్చుకున్న తీరును ఆవిష్కరించారు. వారాహి యాత్రతో ఒక రకమైన అనుకూల వాతావరణం క్రియేట్ చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు.
పవన్ కార్నర్ చేసే తీరు బాగుంది. వ్యవస్థాగత లోపాలపై లోతైన అధ్యయనం బాగుంది. వలంటీరు వ్యవస్థ, మహిళల అదృశ్యంపై మాట్లాడేసరికి పవన్ అడ్డంగా బుక్కయ్యారనేవారే అధికం. అనవసరంగా లేనిపోని అంశాల్లో దూరారని ఎక్కువ మంది భావించారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే పవన్ వ్యాఖ్యలు గూఢాచర్యం; శాంతి భద్రతల విఘాతానికి దారితీశాయన్నట్టు అతి చేసింది. విశ్లేషకులు, అస్మదీయ సినీ ప్రముఖులు అందరూ రంగంలోకి దిగిపోయారు. కానీ ఆ ఒక్క వ్యవస్థ చుట్టూ ఉన్న లోపాలను రోజుకో రీతిలో బయటపెట్టేసరికి మైండ్ బ్లాక్ అయ్యింది. వారి వాదనలు ఎక్కడా పనిచేసినట్టు కనిపించలేదు.
గోదావరి జిల్లాలో పవన్ యాత్ర అనేసరికి ఒక్క కాపుల చుట్టూయే విశ్లేషణ తిరుగుతుంటుంది. కాపులు, ఆపై పవన్ అభిమానులు అధికంగా ఉండడం వల్లే యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ పవన్ యాత్రతో సాధించింది అన్నివర్గాల అభిమానం. సినీ అభిమానమే కాదు.. ఎదుటి హీరోపై ఏహ్య భావం కూడా అధికం. అటువంటిది అందరి అభిమానాన్ని చూరగొనడం గొప్ప విషయం కాదు. ఈ విషయంలో పవన్ సాధించింది ముమ్మాటికీ విజయమే.