Peddireddy Ramachandra Reddy: రాజకీయాల్లో ఉన్నప్పుడు జయాపజయాలు ఉంటాయి. దర్పంతో పాటు ఇబ్బందులు వస్తాయి. రాజకీయంగా అనూహ్య అవకాశాలతో పాటు అంతులేని అధికారం సొంతమైన తరువాత వాటి పర్యవసానాలు కనిపిస్తాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబానికి అదే ఎదురైంది. రాయలసీమకు మకుటం లేని మహారాజుగా వ్యవహరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Chandra Reddy). ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అయితే తాడేపల్లి ప్యాలెస్ అంతా తన కంట్రోల్లో ఉంచుకున్నారన్న పేరును సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా కూడా మారారు. ఎంతలా అంటే ఏపీలో ఎవరికీ ఎక్కడ సీటు ఇవ్వాలో డిసైడ్ చేసే స్థాయికి మిధున్ రెడ్డి చేరుకున్నారు. అయితే అది వైసిపి అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఉండగా.. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఏకంగా అటవీ భూములను కొల్లగొట్టారని కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇది వారికి సానుభూతి తెస్తాయని వారు భావిస్తున్నారు కానీ.. ఎప్పుడు పడని రాజకీయ గండి ఇప్పుడు ఎదుర్కోబోతున్నారన్న సంకేతాలు మాత్రం వినిపిస్తున్నాయి.
* పక్కా ప్రణాళికతో..
పెద్దిరెడ్డి ఫ్యామిలీ( Peddireddy family) విషయంలో కూటమి ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. వారి కుటుంబం వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిందన్నది గుర్తించింది కూటమి. అందుకే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని భావించి అరెస్టు చేయించింది. సుదీర్ఘకాలం జైల్లో ఉంచింది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల వ్యవహారం పై పడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుమారు 70 ఎకరాలు మంగళం అటవీ భూముల ఆక్రమించారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తండ్రి భూమాఫియా డాన్ గా.. తనయుడు లిక్కర్ మాఫియా డాన్ గా ఖ్యాతి గడించారు. అయితే లిక్కర్ కుంభకోణంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్ళింది ప్రభుత్వం. ఇప్పుడు అటవీ భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందా? అనే చర్చ నడుస్తోంది.
* జగన్ కు సాయం లేకుండా..
జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) అత్యంత సన్నిహితులు ఉన్నారు. వలయంగా పనిచేసే నేతలు ఉన్నారు. కానీ ప్రజలతో నేరుగా సంబంధం ఉండే వారు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి లాంటి నేతలు కేవలం పార్టీని సమన్వయం చేసుకునే వారే తప్ప.. నేరుగా ప్రజలతో సంబంధాలు వారికి అంతంత మాత్రమే. కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అలా కాదు. రాయలసీమలో తుడుచుపెట్టుకుపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో సైతం ఆ ఫ్యామిలీ నెగ్గుకు వచ్చింది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ పై ఆధారపడుతున్నారు. కానీ కూటమి తన వ్యూహంలో భాగంగా జగన్ బలంగా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీని ప్రజల్లో పలుచనా చేస్తోంది. కేసులతో వారిని భయపెడుతోంది. అయితే ఈ భయం ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో వచ్చే ఎన్నికల్లో చూడాలి. అయితే ఇప్పటికే జగన్ పెద్దిరెడ్డి కుటుంబాన్ని దూరం పెట్టారన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే కూటమి వ్యూహం ఫలించినట్టే.