Peddireddy Midhun Reddy: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ చేపడుతుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఒకవైపు విచారణ కొనసాగుతోంది. 29 మంది నిందితులకు గాను 12 మంది అరెస్టయ్యారు. అయితే లోతైన దర్యాప్తు చేస్తుండగా.. నిందితులు ఒక్కొక్కరికి బెయిల్ లభిస్తోంది. ఈ క్రమంలో బెయిల్ పై బయటకు వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కార్యాలయాలతో పాటు నివాసాల్లో సిట్ తనిఖీలు చేపడుతుండడం విశేషం. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఆయన ఐక్యరాజ్యసమితికి వెళ్లే పార్లమెంటరీ బృందంలో ఒక సభ్యుడిగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపిలో చేరుతారన్న అనుమానాలను మరింత బలపరిచింది. అయితే ఈరోజు తిరుపతి తో పాటు హైదరాబాద్, బెంగళూరు నివాసాల్లోను సోదాలు జరుగుతున్నాయి.
* జగన్ కు సన్నిహిత నేత
వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. అప్పట్లో మద్యం లావాదేవీలు అన్ని మిథున్ రెడ్డి చూసేవారని టాక్ ఉంది. వైసీపీ హయాంలో ప్రతి శనివారం తాడేపల్లికి వచ్చి.. లిక్కర్ లెక్కలు చెప్పేవారని వైసీపీలోని ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని వైసిపి నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు కూడా. అయితే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు తో సమానంగా.. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కమీషన్ల రూపంలో ఎక్కువగా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
* పిఎల్ఆర్ కార్యాలయాల్లో సోదాలు..
అయితే ఇటీవల పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి( Mithun Reddy) కోర్టులో బెయిల్ లభించింది. అయితే చంద్రబాబుతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పందం చేసుకున్నారన్న అనుమానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించాయి. అందుకే చాలా రకాల కేసుల్లో పెద్దిరెడ్డికి మినహాయింపు లభించింది అన్న కామెంట్స్ ఉన్నాయి. పైగా ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. అటువంటి సమయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులందరూ గెలిచారు. ఇలా గెలవడం వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్న అనుమానాలు జగన్మోహన్ రెడ్డిలో బలంగా పెరిగాయి. ఆ కారణం చేతనే తాజాగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని దూరం పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా పెద్దిరెడ్డి కి చెందిన పి ఎల్ ఆర్ కంపెనీల ద్వారానే మద్యం కుంభకోణంలో లభించిన బ్లాక్ మనీని.. వైట్ గా మార్చారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం తోనే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పై కేసు నమోదు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే పిఎల్ఆర్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీల విషయంలో సిట్ పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. అది తెలిసి జగన్మోహన్ రెడ్డి తన వరకు వస్తుందన్న అనుమానంతోనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని సైడ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికైతే ఎంపీ మిధున్ రెడ్డి ని టార్గెట్ చేసుకొని సిట్ దర్యాప్తు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.