Tirumala Adulterated Ghee Case: తిరుమల ( Tirumala) లడ్డు వివాదంలో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇదో వ్యవస్థీకృత నేరంగా జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఇదో పెద్ద రాకెట్ అని తేలుతోంది. తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం మరో పదకొండు మందిపై కేసు నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో 35 మంది నిందితులు కాగా.. ఓ పదిమంది అరెస్టు జరిగింది. తాజాగా టీటీడీ మార్కెటింగ్ మాజీ జిఎం సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలను పొందుపరిచింది సీట్. వెండి కంచాలు, బహుమతుల ద్వారా ప్రలోభాలకు గురిచేసినట్లు స్పష్టం చేసింది. అయితే అసలు ఇది కేసే కాదని.. రాజకీయ ప్రేరేపిత కేసు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడిస్తున్న రిమాండ్ రిపోర్టులు మాత్రం సంచలనం రేకెత్తిస్తున్నాయి.
సుప్రీం కోర్టును ఆశ్రయించిన సుబ్బారెడ్డి..
లడ్డు వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే వైవి సుబ్బారెడ్డి ( YV Subba Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది చిన్న అభియోగం కాదని.. కేంద్ర దర్యాప్తు బృందం సిబిఐతో విచారణ చేపట్టాలని కోరారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేయడంతో వైవి సుబ్బారెడ్డి కేంద్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. అయితే తిరుపతి వేదికగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించింది. అయితే క్రమేపీ నిందితుల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే మాత్రం ఇదో వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సి వస్తోంది.
బయటపడుతున్న లోపాలు..
వై వి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఉండేవారు. చివరి ఏడాది కరుణాకర్ రెడ్డి ఆ బాధ్యతలో ఉన్నారు. అయితే టీటీడీ లడ్డు వివాదం బయటకు వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి ఏకంగా ప్రమాణానికి సిద్ధపడ్డారు. అయితే నిన్న వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు అయ్యారు పరకామణి కేసులో. పరకామణి చోరీ సమయంలో తాను టీటీడీ అధ్యక్షుడిని కాదు అని విచారణకు హాజరైన అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే నిలకడ లేదని అర్థమవుతోంది. ఇంకోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డు వివాదంలో పట్టు బిగిస్తోంది. అయితే ఈ వివాదంలో భాగస్వామ్యం అయిన టిటిడి దిగువ స్థాయి సిబ్బందిపై కూడా ఇప్పుడు కేసు నమోదు చేసింది. దీంతో అంత ఈజీగా ఈ కేసును సీట్ విడిచి పెట్టే అవకాశం లేదు. అందుకే భయపడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. చివరివరకు ఈ విచారణను తీసుకెళ్లి ఎన్నికల ముందు బయట పెట్టాలన్నదే ప్రభుత్వ వ్యూహంగా అనుమానిస్తోంది. మొత్తానికి అయితే తిరుమల లడ్డు వివాదం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇబ్బందికరమే. ఆ పార్టీ ఈజీగా తీసుకున్నంత సులువు కాదు.