Singaiah Death Case: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై( Y S Jagan Mohan Reddy) చాలా రకాల కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు చాలా నమోదయ్యాయి కూడా. ఓ 16 నెలల పాటు ఆయన జైల్లో కూడా గడిపారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే తాజాగా నమోదైన కేసులో మాత్రం ఏ2గా ఉండడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో ఆయన చిక్కుల్లో పడడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. ఈనెల 18న సత్తెనపల్లిలోని ఓ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. ఈ క్రమంలో జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఈ సంఘటన రెంటపాళ్ల వద్ద చోటు చేసుకోగా మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట సింగయ్య చనిపోయిన విషయంలో జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఓ ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందాడని ధ్రువీకరించారు.
Also Read: రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవీ
* వీడియోలు బయటకు రావడంతో
అయితే తాజాగా సోషల్ మీడియాలో( social media) ఆ ఘటనకు సంబంధించి వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో కీలక మలుపులు జరిగాయి. అయితే తొలుత వేరే సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు సెక్షన్లు మార్చారు. జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని బాధ్యుడిగా చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఈయన 11 సంవత్సరాలుగా కారు డ్రైవర్ గా సేవలందిస్తున్నారు. ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఉండే ఈయన ప్రభుత్వం తరఫున.. జగన్ వాహన డ్రైవర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఏ 1. అయితే ఏ 2 గా జగన్మోహన్ రెడ్డి, ఏ3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, a4 గా వై వి సుబ్బారెడ్డి, ఏ 5 గా మాజీ మంత్రి పేర్ని నాని, ఏ 6 గా విడుదల రజినీని చేర్చారు. అయితే ఆ సమయంలో వీరెవరు జగన్ ప్రయాణిస్తున్న వాహనంలో లేరు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి జన సమీకరణ చేశారని.. జనం వచ్చి కాన్వాయ్ మీద పడడం వల్లే ఈ ఘటన జరిగిందని.. అందుకే ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ వీరిపై కేసులు నమోదు చేశారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
* అనుమతులకు మించి
వాస్తవానికి తాడేపల్లి లోని( Tadepalli ) జగన్ నివాసం నుంచి సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి కేవలం కాన్వాయ్ లో మూడు వాహనాలుకు మాత్రమే పోలీసులు అనుమతించారు. కానీ అందుకు విరుద్ధంగా వాహనాలను ఏర్పాటు చేసి, జన సమీకరణ చేశారని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చెబుతున్నారు. వీరిపై బిఎన్ఎస్ లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. దీంతో ఈ సెక్షన్ 105 గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఒక వ్యక్తి మరణానికి కారణం అయినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే సంబంధిత వ్యక్తులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నేర తీవ్రతను బట్టి ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు.
* నేరాన్ని ప్రేరేపించారని
అయితే వాహన డ్రైవర్ తో పాటు జగన్ వరకు ఓకే. మిగతా పార్టీ నేతల విషయంలో నమోదైన సెక్షన్ల విషయంలో చర్చ నడుస్తోంది. అయితే వారు నేరానికి ప్రేరేపించారని అభియోగంపై బీఎన్ఎస్ 49 సెక్షన్ కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటి వాటిపై చర్యలు తీసుకోవచ్చు. జన సమీకరణ చేశారన్న కారణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో రకరకాల చర్చ నడుస్తోంది.
