Simhachalam : సింహాచలం దేవస్థానంలో( Simhachalam Devasthanam) చందనోత్సవంలో భాగంగా ఘోర అపశృతి జరిగిన సంగతి తెలిసిందే. క్యూ లైన్ పక్కనే ఉన్న గోడ కూలిన ఘటనలో 9 మంది భక్తులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు కూడా. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సీఎం చంద్రబాబు త్రిసభ్య కమిషన్ విచారణకు ఆదేశించారు. మునిసిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన ఈగల్ విభాగాధిపతి ఐజి రవికృష్ణ, జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు తో కూడిన త్రిసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది.
Also Read : అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి!
* విచారణలో సంచలన విషయాలు.. విచారణలో( enquiry) సంచలన విషయాలు నిర్ధారణ అయ్యాయి. గోడను పునాదులు కూడా లేకుండా నిర్మించారు. వర్షపు నీరు వెళ్లేందుకు కనీసం గోడకు లీఫ్ హోల్స్ కూడా పెట్టలేదు. చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించాలని విచారణలో తేలింది. గోడ నిర్మించే సమయంలోనూ ఎలాంటి తనిఖీలు చేయలేదని త్రీ మెన్ కమిషన్ అభిప్రాయపడింది. దీంతో సింహాచలం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విచారణ కమిటీ ఆధారంగా ఏడుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. సస్పెన్షన్ వేటు పడిన వారిలో సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జి, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ ఉన్నారు.
* బ్లాక్ లిస్టులో కాంట్రాక్టర్..
మరోవైపు కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను( contractor Lakshmi Narayana) బ్లాక్ లిస్టులో పెట్టింది కూటమి ప్రభుత్వం. కాంట్రాక్టర్ తో పాటు ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించింది. ముగ్గురు అధికారుల బృందంతో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ శరవేగంగా పావులు కదిపింది. కాంట్రాక్టర్ తో పాటు దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులను విచారించింది. కాంట్రాక్టర్ పై అధికారుల ఒత్తిడి చేసినట్లు కూడా తేలింది. ఆ రెండు శాఖలకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కమిటీ నిర్ధారించింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం.
* లక్షలాదిగా భక్తులు..
ఏటా సింహాచలం దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామి వారికి చందనోత్సవం( chandanotsavam ) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. ఆ నిజరూపం దర్శనం చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనాలు ఉన్నాయి. చందనోత్సవం కోసం వేచి ఉన్న భక్తులు పై గోడ కూలడంతోనే ఈ ఘటన జరిగింది. సింహాచలం చరిత్రలోనే ఇది పెను విషాదం. అందుకే కూటమి ప్రభుత్వం సీరియస్ చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ అధికారులపై వేటు వేసింది.
Also Read : సింహాచలం గోడ కూలిన ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు.. వైరల్ వీడియో