Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు దాటిపోయింది. ఈ క్రమంలోనే పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ.. రాష్ట్రాన్ని గాడిలో పెడుతోంది. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూనే.. ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. అవినీతి అనే పదాన్ని కూటమి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఆ పదం వినిపిస్తే చాలు కఠిన చర్యలకు వెనుకాడటం లేదు. కూటమిలో జనసేన కీలకంగా ఉంది. పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదు. అవకతవకలకు చోటు ఇవ్వడం లేదు. పారదర్శకమైన పాలన అందించడానికి తనవంతుగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ముమ్మరం చేశారు. తాను పర్యవేక్షిస్తున్న శాఖలలో సచ్చీలురైన అధికారులను నియమించుకున్నారు. ఫలితంగా ఆ అధికారులు పవన్ కళ్యాణ్ నిరువర్తిస్తున్న శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవకతవకలు.. ఇతర వ్యవహారాలపై విచారణ జరుగుతున్నది. నిధుల పక్కదారి వ్యవహారంపై కూడా ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉంది. ఇవన్నీ జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ పేరును ఓ అధికారి సాంతం వాడుకున్నారు. పైగా తనకు పవన్ కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఆ అధికారి చెప్పుకోచ్చారు. మైనింగ్ వ్యవహారాలలో తల దూర్చారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. దీంతో ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.
కాకినాడ డీఎఫ్ వో గా రవీంద్రనాథ్ రెడ్డి పని చేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ పేరును ఇటీవల విపరీతంగా వాడటం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కు, తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకున్నారు. సాక్షాత్తు డిఎఫ్ఓ అలా మాట్లాడటంతో కిందిస్థాయి ఉద్యోగులు నిజమే అని అనుకున్నారు. మైనింగ్ వ్యవహారాలలో అధికారి చెప్పినట్టుగా విన్నారు. ఆ వ్యవహారాలు మొత్తం అక్రమ మార్గాలు కావడంతో పవన్ కళ్యాణ్ కు ఇంటలిజెన్స్ అధికారుల ద్వారా ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే ఆయన స్పందించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే ఆయన చర్యలకు ఉపక్రమించారు. అవినీతిని తాను సహించబోనని.. తన పేరును అక్రమ పనులను చేయడానికి అధికారులు ఉపయోగిస్తే ఉపేక్షించబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన పేరు, తన పేషి పేరు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ వ్యవహారాలలో ఎవరూ తల దూర్చకూడదని.. నిబంధనల ప్రకారమే అన్ని చేసుకుంటూ పోవాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు..” గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది. అవినీతిని పెంచి పోషించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలా చేయదు. అలాంటి వాటిని ఒప్పుకోదు. ప్రజలు ఎన్నో ఆశలతో మాకు అధికారాన్ని కట్టబెట్టారు. అలాంటప్పుడు వారి ఆశలను మేము వమ్ము చేయలేం.. అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని” పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.