భారతదేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ వల్ల ఉన్న ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ఏ ప్రభుత్వ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అవసరం. అయితే కొందరు ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డులో వయస్సును మార్చుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
రాష్ట్రంలో చాలామంది ఈ విధంగా వయస్సు మార్చుకుని పింఛన్ పొందుతున్నారని తెలుస్తోంది. కొందరు పింఛన్ కు దరఖాస్తు చేయడం కోసమే ఆధార్ కార్డులో వయస్సును మార్చుకుంటున్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఆధార్ కార్డు అప్‌డేట్ హిస్టరీ ప్రింట్ అవుట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో పథకాల ద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో అర్హులకే ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనాలు దక్కుతాయని భావిస్తోంది. ఆధార్ కార్డు వయస్సులో మార్పులుచేర్పులు జరిగినట్టు గుర్తిస్తే అందులో ఉన్న తక్కువ వయస్సునే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆధార్ కార్డులో నమోదు సమయంలో వయస్సు తప్పుగా పేర్కొని ఉంటే మాత్రం వాళ్లు గ్రామ, వార్డ్ సచివాలయాలలో దరఖాస్తు చేసుకుని సరైన వయస్సుతో పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. అధికారులు వయస్సు మార్చుకుని అక్రమంగా పింఛను పొందిన వారికి పింఛనును తొలగించనున్నారని తెలుస్తోంది.