Amaravati Farmers: అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. మరోవైపు భూములు ఇచ్చిన రైతుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వాస్తవానికి గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అమరావతి రైతులు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో సుదీర్ఘకాలం పోరాట బాట పట్టారు. భూములను త్యాగం చేయడంతో పాటు విలువైన పంటలను సైతం వదులుకున్నారు. అప్పట్లో జరిగిన ఒప్పందం మేరకు వైసీపీ సర్కార్ కనీసం కౌలు కూడా చెల్లించలేదు. ఇబ్బందులు పడిన అమరావతి రైతులకు స్వాంతన చేకూర్చేలా చంద్రబాబు సర్కార్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటోంది.
* కౌలు నిధుల విడుదల
కూటమి( TDP Alliance) అధికారంలోకి రాగానే గత వైసిపి ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కౌలు నిధులను విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో కౌలు మొత్తం జమ చేసింది. ఈ మేరకు బ్యాంకులకు ప్రభుత్వం నుంచి నిధులు బదిలీ కావడంతో.. రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. దీంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లపాటు సంక్రాంతి పండుగ మరిచిపోయిన తమకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకొస్తున్నారు.
*రూ. 255 కోట్లు విడుదల
అమరావతి రాజధాని( Amaravati capital ) పరిధిలో పింఛన్లు, కౌలు మొత్తాలు చెల్లించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.255 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కౌలు మొత్తం తో పాటు ఈ ఏడాదికి సంబంధించి కౌలు మొత్తాన్ని అందించింది. మరోవైపు రాజధానిలో భూములేని నిరుపేదలకు చెల్లించే పెన్షన్లు కూడా సంక్రాంతి కానుకగా.. వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో రాజధాని రైతుల్లో ఒక రకమైన ఆనందం వ్యక్తం అవుతోంది.
* త్వరలో పునర్నిర్మాణ పనులు
అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదముద్ర కలుగుతోంది. రోడ్డుతో పాటు రైలు ప్రాజెక్టులకు సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతి రైతులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మొత్తానికైతే అమరావతి రైతులకు నిజమైన పండుగ వచ్చినట్లు అయ్యింది.