YCP: వైసీపీకి బిగ్ షాక్ తగలనుందా? ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం పార్టీకి అంటీముట్టనట్టుగా ఉండటంతో వారు పార్టీని వీడడం దాదాపు ఖాయమని తేలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కీలక నేతలను సైతం జగన్ పక్కన పెట్టారు. అధినేత నిర్ణయం పై ఎక్కడికక్కడే నేతలు అసంతృప్తి చెందుతున్నారు. ఈ క్రమంలో ఖరారైన అభ్యర్థులు సైతం పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా నెల్లూరు, ఒంగోలు ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడటం ఖాయంగా తేలుతోంది. అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం.
గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈసారి జగన్ ఆదాలను పక్కన పెట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారు. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ సర్వేల్లో సైతం కోటంరెడ్డి గెలుపొందుతారని స్పష్టమైంది. దీంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడనుండడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం ఆయన అనుసరిస్తారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం టిడిపిలో చేరతారని తెలుస్తోంది. వైసీపీ హై కమాండ్ ఆయన్ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి చివరి వరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. అటు బాలినేని సైతం పొలిటికల్ డిఫెన్స్ లో ఉన్నారు. మాగుంట విషయంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలో చేరడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆయన చంద్రబాబుతో పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టిడిపి, బిజెపి, జనసేనల మధ్య పొత్తుల వ్యవహారం తేలేక మాగుంట శ్రీనివాసులరెడ్డి సరైన ముహూర్తం చూసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలుస్తోంది.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి కంచుకోటగా నిలిచాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసిపి దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది. 2019 ఎన్నికల్లో సైతం నెల్లూరులో శత శాతం విజయాన్ని దక్కించుకుంది. ప్రకాశం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం ఆ రెండు జిల్లాల్లో సీన్ మారుతోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసిపికి దూరమయ్యారు. టిడిపిలో చేరారు. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే సిట్టింగ్ ఎంపీలు దూరం కావడం వైసీపీకి లోటే.