Vijayasai Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై లోతైన దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతుండగా.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఒక నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డికి షాక్ తగిలింది. ఆయనకు సమన్లు జారీ చేసింది ఈడీ. గతంలో విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు ఆయనను విచారించనుంది ఈడి. అందుకే సమన్లు జారీ చేసింది. వైసిపి హయాంలో మద్యం డిస్టలరీల నుంచి ముడుపులు సేకరించి ప్రభుత్వ పెద్దలకు అందజేసిన వ్యవహారంలో.. ఇప్పటికే రాష్ట్ర సిఐడి విభాగానికి చెందిన సిట్ విజయసాయిరెడ్డిని నిందితుల జాబితాలో చేర్చింది.
* అనేక రకాల అనుమానాలు..
వాస్తవానికి మద్యం కుంభకోణం( Liquer Scam) కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. అలాగని ఆయన అరెస్టు జరగలేదు. మిగతా వారి అరెస్టులు జరగడం.. కొందరు బెయిల్ పై బయటకు రావడం జరిగిపోయింది. అయితే విజయసాయిరెడ్డి విషయంలో మినహాయింపు దక్కడం పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఇంట్లోనే మద్యం స్కాం కు సంబంధించిన చర్చలు జరిగేవని.. అందులో ఇతర నిందితులు కూడా పాల్గొనేవారు అని ప్రత్యేక దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. దీని ఆధారంగానే ఈడి ఇప్పుడు ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని విజయసాయి రెడ్డికి సమానులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
* సాక్షి నుంచి నిందితుడిగా..
వాస్తవానికి మద్యం స్కాం కు సంబంధించిన పూర్తి వివరాలు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) అందించారన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ హయాంలోనే మద్యం కుంభకోణం జరిగినట్లు విజయసాయిరెడ్డి చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి అని సంచలన ఆరోపణలు చేశారు. ఏదో ఒక కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం కేసు పై మాట్లాడారు. తనను పిలిస్తే పూర్తి వివరాలు ఇస్తానని కూడా పేర్కొన్నారు. అందుకే సిఐడి పలుమార్లు ఆయనకు విచారణకు పిలిచింది. ఈ విచారణలో కీలక అంశాలను ఆయన బయటపెట్టినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే అదే సి ఐ డి ఎఫ్ ఐ ఆర్ లో సాయి రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చింది. అప్పటివరకు ఈ కేసులో సాక్షిగా ఉన్న సాయి రెడ్డి నిందితుడిగా మారారు. అయితే ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత సాయిరెడ్డిని తమ కేసులోనూ నిందితుడిగా చేరిస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు అని భావిస్తున్నారు. మొత్తానికి అయితే మద్యం కుంభకోణం కేసులో ఈడి ఎంట్రీ తో సీన్ మారుతున్నట్టు కనిపిస్తోంది.