MP Avinash Reddy Vs YS Sunita : తన తండ్రి హత్యకేసు విషయంలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత గట్టిగానే పోరాడుతున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కావాలని ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్నారు. తరచూ న్యాయస్థానాల గుమ్మం ఎక్కుతునే ఉన్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు… ఇలా ఆమె ఎక్కని న్యాయస్థానం మెట్లు లేవు. కానీ ఆమెకు మిశ్రమ ఫలితమే దక్కుతోంది. అయినా మొక్కవోని దీక్షతో ఆమె సహనంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నెలాఖరులోగా కేసు విచారణ పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సీబీఐకి ఆదేశించిన తరుణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అనుకున్న ప్రకారం ఒక్క అవినాష్‌రెడ్డి మినహాయించి, మిగిలిన నిందితులందరినీ అరెస్ట్ చేశారు. అయితే అవినాష్ విషయంలోనే సీబీఐకి ఎప్పటికప్పుడు చుక్కెదురవుతూ వస్తోంది. ఈ ఎపిసోడ్ లో సీబీఐకి న్యాయస్థానాల నుంచి ఎప్పటికప్పుడు అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. అయితే అనూహ్యంగా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అవినాష్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. సునీతకు నిరాశే ఎదురైంది.
తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును డాక్టర్ సునీత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో సునీత కోరారు. అవినాశ్‌పై అభియోగాలన్నీ తీవ్రమైనవేనని ఆమె పేర్కొనడం గమనార్హం.సీబీఐ అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని, హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని పిటిషన్‌లో సునీత ప్రస్తావించారు. సుప్రీం వెకేషన్ బెంచ్ సునీత పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్‌కు ఊరటనిచ్చే తీర్పు ఇవ్వగా, సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.