CM Revanth Reddy Birthday: ఎక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టారు రేవంత్ రెడ్డి. భారత రాష్ట్ర సమితి అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. జెడ్పిటిసిగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు . ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గాన్ని తన ఇలా కాగా మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ.. ఆయన వెనుకడుగు వేయలేదు. అప్పటి ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ.. ప్రజల్లో సానుభూతిని పెంచుకోగలిగారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజి గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకొని.. వరుస ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. తట్టుకోని నిలబడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, హుజురాబాద్ ఉప ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికలు, నాగార్జునసాగర్ కు ఉప ఎన్నికలు.. ఇలా ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ ఆయన నిలబడ్డారు.
ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం..
నాటి భారత రాష్ట్ర సమితి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలను కూడా ఎదుర్కొని ఆయన ధైర్యంగా నిలబడ్డారు. 50 సంవత్సరాలు దాటిన కొద్ది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు.. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. ఆయనేం వేలకోట్ల ఆస్తిపరుడు కాదు. ఒక అత్యంత సామాన్య కుటుంబాన్ని నుంచి వచ్చాడు. రాజకీయాలలోకి వచ్చిన రెండు దశాబ్దాలలోనే ముఖ్యమంత్రి అయ్యారు. దానికోసం ఆయన మొదటి నుంచి ప్రశ్నించే స్వభావాన్ని మాత్రమే ఎంచుకున్నారు. ఏ రాజకీయ నాయకుడైన తన ప్రయాణాన్ని అధికారంలో ఉన్న పార్టీ నుంచి మొదలుపెడతారు. రేవంత్ రెడ్డి అందుకు భిన్నమైన వ్యవహార శైలి ఎంచుకున్నారు. ఆయన తన రాజకీయ జీవితం ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి నాడు అధికారంలో లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన తన రాజకీయ ఓనమాలు ప్రారంభించారు. జెడ్పిటిసిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగారు.
రాజకీయాన్ని రాజకీయం లాగే..
రేవంత్ రెడ్డి రాజకీయాన్ని రాజకీయం లాగానే చూశారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. అందులో ఎదురైన కష్టాన్ని ఆయనే అనుభవించారు. నష్టాన్ని కూడా ఆయనే చవి చూశారు. తన స్వలాభం కోసం ఎవర్ని బలి పెట్టలేదు. ఏ దశలోనూ నమ్మకాన్ని కోల్పోకుండా స్థానికుల వాతావరణం లోనే ప్రయాణించారు. అదే ఆయన విజయ రహస్యమని అనుచరులు అంటూ ఉంటారు. ” నేను మినిస్టర్ అయినప్పుడు రేవంత్ రెడ్డి విజయోత్సవ ర్యాలీలో నా కారు ముందు గంతులు వేశాడు. నాడు ఫోటోలలో కనిపించడానికి ముందు వరుసలోకి వచ్చేవాడని” ఇటీవల హరీష్ రావు పదేపదే వ్యాఖ్యానించారు. అది రేవంత్ రెడ్డిని ఎగతాళి చేసినట్టు ఉండవచ్చు గాని.. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చి.. ఎక్కడిదాకా ఎదిగాడో అర్థమవుతుంది. అది ఒక రకంగా కేజీఎఫ్ సినిమాలో రాఖీ కి ఇచ్చిన ఎలివేషన్ లాగా తెలుస్తుంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆఫర్ చేసినప్పటికీ..
జెడ్పిటిసిగా, ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గానే గెలిచారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆఫర్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి సున్నితంగానే తిరస్కరించారు. నాడు ఆయనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. ప్రతిక్షణం తన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఎప్పుడైతే కెసిఆర్ తన మొదటి శత్రువుగా ఎంచుకున్నారో.. అప్పటినుంచి రేవంత్ రెడ్డికి ఎదురనేది లేకుండా పోయింది. ప్రస్తుతం రేవంత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాల ఆరోపణలు చేసినప్పటికీ ఆయన విప్లవాత్మక నిర్ణయాల వైపు వెళ్ళిపోతున్నారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించడం.. గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతుల రుణాల మాఫీ, స్కిల్ యూనివర్సిటీ, ఐటిఐ ల కు జవసత్వాలు, మూసి నదికి పునరుజ్జీవం వంటి నిర్ణయాలతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. హైడ్రా విషయంలోనూ ఆయన దూకుడు తగ్గించుకోవడం లేదు..
ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ..
కాంగ్రెస్లో కొంతమందికి రేవంత్ అంటే కోపం ఉండొచ్చు. మరి కొంతమందికి ఈర్ష్య ఉండొచ్చు. కానీ రేవంత్ మాత్రం ఆశలు లేని కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు అందించారు గడ్డాలు, మీసాలు పెంచుకున్న వారిని కాదని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షాల విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఐదు పదుల వయసులో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలలో ఒక మాన్ స్టర్.. ఈ మాట అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. నేడు రేవంత్ రెడ్డి తన 51వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలో పూజలు చేస్తున్నారు. ఆ తర్వాత మూసీ నది వెంట పాదయాత్ర చేయనున్నారు.
ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayRevanthAnna#PeoplesCMRevanthAnna #TelanganaCM pic.twitter.com/sFDchXZLrB
— Aapanna Hastham (@AapannaHastham) November 8, 2024