YS Sharmila: వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఆమె కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? కేవలం రాయలసీమలోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా షర్మిల దూకుడు తగ్గించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు సైతం పెద్దగా లేవు. ఈ తరుణంలో ఆమె మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. ఏపీలో ఒక కీలక నేతకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టి చర్చలు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ మొదలైంది. అందుకే షర్మిల ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారన్నది ఒక ప్రచారం. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కానీ ఆమె సీరియస్ గా కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు మాత్రం పొలిటికల్ సర్కిల్లో తెగ హడావిడి నడుస్తోంది.
* కాంగ్రెస్ లో విలీనం..
తెలంగాణలో ( Telangana) తండ్రి పేరిట పార్టీ ఏర్పాటు చేశారు షర్మిల. అది వర్కౌట్ కాకపోయేసరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఏపీ సారధ్య బాధ్యతలు చూస్తున్నారు. కానీ అనుకున్న స్థాయిలో ఆమె పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఆమె ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పట్టు దక్కడం లేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే అండగా నిలిచారు షర్మిల. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వరకు గట్టిగానే కృషి చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు మంచి పదవితో పాటు ప్రయోజనం ఉంటుందని ఆశించారు. అవేవీ దక్కక పోయేసరికి అన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. తాను ఆశించినట్టు అన్నకు రాజకీయ అందలం నుంచి దూరం చేశారు. అయితే తాను మాత్రం రాజకీయంగా బలపడలేకపోయారు. అందుకే షర్మిల కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* సామాజిక వర్గ ప్రాబల్యం.. రాయలసీమ( Rayalaseema ) ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం అధికం. పైగా రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని అక్కడి నాయకులు ఇష్టపడతారు కూడా. ఆ కారణంతోనే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పట్టు సాధించగలిగారు. మొన్నటి కూటమి ప్రభంజనంలో సైతం ఏడు స్థానాలను అక్కడ నిలబెట్టుకున్నారు. మూడు పార్లమెంట్ స్థానాలను రాయలసీమ ప్రాంతంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంది. అందుకే రాయలసీమ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని షర్మిల అందుకుంటారని ప్రచారం నడుస్తోంది. గతంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇలాంటి ప్రయత్నమే చేశారు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ రాయలసీమ ప్రజల్లో మాత్రం సెంటిమెంట్ ఉంది. షర్మిల లాంటి నేత ప్రయత్నిస్తే ఖచ్చితంగా అక్కడ వర్కౌట్ కు అవకాశం ఉంది. కానీ ఆమె ప్రత్యేక పార్టీ పెడతారా? లేదా? అన్నది చూడాలి.