YS Sharmila : కాంగ్రెస్ కు గతాన్ని గుర్తు చేసిన షర్మిల.. జగన్ విషయంలో అలెర్ట్!
కాంగ్రెస్ ను విభేదించి, డ్యామేజ్ చేశారు జగన్. ఏపీలో ఉనికి లేకుండా చేశారు. ఇప్పుడు తన పార్టీ ఉనికి లేకపోవడంతో.. అదే కాంగ్రెస్ ను ఆశ్రయిస్తున్నారు. అందుకే షర్మిలా ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. జగన్ వైఖరి గురించి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపారు.
YS Sharmila : ఏపీలో పరిస్థితులపై ఢిల్లీ వెళ్లి గళం ఎత్తారు జగన్. గత 50 రోజుల కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు జగన్.పార్టీ శ్రేణులతో పాటు జాతీయ నాయకులు హాజరయ్యారు. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రతినిధులు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్, అమ్ ఆద్మీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు హాజరయ్యారు. జగన్ కు బాసటగా నిలిచారు. ఇండియా కూటమిలోని కీలక భాగస్వామ్య పార్టీలన్నీ హాజరైనా.. సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం హాజరు కాలేదు. అక్కడ కాంగ్రెస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని వైసిపి సైతం గుర్తుచేసింది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే కాంగ్రెస్ హాజరుకాకుండా అడ్డుకున్నది షర్మిల అని తెలుస్తోంది. గత ఐదేళ్ల కాలంలో జగన్ అనుసరించిన తీరు, బిజెపితో అంటగాకడం, కాంగ్రెస్ పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో మాట్లాడడం వంటి విషయాలను గుర్తు చేశారు. షర్మిల అభ్యంతరాలతోనే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను పంపలేదని తెలుస్తోంది. ఆమె వారించడంతోనే.. కేవలం ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరు కావాల్సి వచ్చింది. జాతీయస్థాయిలో సైతం దీనిపైనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ తో జతకట్టేందుకు జగన్ సిద్ధపడ్డారని.. కానీ షర్మిల అడ్డంకిగా నిలవడం వల్లే కాంగ్రెస్ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ విషయంలో చాలా రకాల లెక్కలను షర్మిల కాంగ్రెస్ పెద్దలకు వివరించినట్లు సమాచారం.
* కాంగ్రెస్ పోరాటానికి మద్దతు తెలిపారా?
వైసిపి ఢిల్లీ దీక్షకు గైర్హాజర్ కావడంపై షర్మిల తాజాగా స్పందించారు. జగన్ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని నిలదీశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? ఐదు సంవత్సరాల పాటు బిజెపితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకా? అది ప్రశ్నించారు. ఏపీ విభజన హక్కులు తాకట్టు పెట్టింది మీరు కాదా అంటూ నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం ఈ తరహా పోరాటం ఎన్నడైనా చేశారా అంటూ ప్రశ్నించారు. మణిపూర్ ఘటనపై నోరెత్తని జగన్ కు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు లేదని తేల్చి పారేశారు. ఒక క్రైస్తవుడు అయి ఉండి.. మణిపూర్ లో క్రైస్తవులు ఊచకోతకు గురైతే నోరు మెదపకుండా.. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా.. బిజెపితో చేతులు కలపలేదా అంటూ ప్రశ్నించారు షర్మిల.
* బిజెపితో చేతులు కలిపిన జగన్
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆయన అకాల మరణం పొందారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి ఆశయానికి వ్యతిరేకంగా వెళ్లి బిజెపితో చేతులు కలపడాన్ని తప్పుపడుతున్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి బిజెపి మతతత్వ విధానానికి ఎప్పుడూ వ్యతిరేకమే. అటువంటిది మణిపూర్ ఘటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తే జగన్ కనీసం స్పందించకపోవడానికి గుర్తు చేస్తున్నారు షర్మిల. జగన్ ఉద్యమంలో నిజం లేదని.. అందులో స్వలాభం కనిపిస్తోందని స్పష్టం చేశారు ఆమె. అటువంటి పార్టీ ధర్నాకు తామెందుకు మద్దతు ఇవ్వాలని లైట్ తీసుకున్నారు.
* మోసం చేశారు
కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగారు జగన్. రాజకీయంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా బలోపేతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా అధికారాన్ని లాక్కున్నారు. ఉమ్మడి ఏపీలో దారుణంగా దెబ్బతీశారు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు బిజెపితో కలిసేందుకు ఆప్షన్ లేదు. జాతీయస్థాయిలో కలిసి వచ్చే పార్టీ లేదు. అందుకే కాంగ్రెస్ ను ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న ఇండియా కూటమి తలుపు తట్టారు. ఈ పరిణామాల క్రమంలో షర్మిల అలెర్ట్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్ అనుసరించిన తీరు, వైఫల్యాల విషయాన్ని ప్రస్తావించారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు జగన్ రాకుండా షర్మిల అడ్డుకట్ట వేస్తున్నట్టే.