YS Sharmila: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కుమార్తె వివాహానికి సంబంధించి వేదిక విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. షర్మిల తన కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని యల హంక ప్యాలెస్ లో నిర్వహించాలని అనుకున్నారు. ఈ ప్రాంతం 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఎవరి భవనాలు వారికే నిర్మించారు. మధ్యలో గోడ కూడా కట్టారు.
ఎవరి భవంతులు వారికి ఉన్నప్పటికీ.. షర్మిల తన భవనంలో కుమార్తె వివాహం చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ, భద్రతను సాకుగా చూపిస్తూ జగన్ షర్మిల కుమార్తె పెళ్లికి ఒప్పుకోవడం లేదు. పైగా ఆయన ఆమెకు ఒక లేఖ కూడా రాశారు. జగన్ రాసిన లేఖలో భద్రత, వ్యక్తిగత గోప్యత వంటి అంశాలను ప్రస్తావించినప్పటికీ.. ప్రతి వాక్యంలో కూడా నేను.. నాది.. ఇది నా నివాసం.. నేను.. నా ఫ్యామిలీ.. సెక్యూరిటీ వంటి అంశాలను జగన్ అందులో ప్రస్తావించారు. వాస్తవానికి నేను.. నాది అనే వాక్యాలను పదేపదే జగన్ ప్రస్తావించడం వెనక వేరే కుట్ర దాగి ఉందని షర్మిల వర్గం అభిప్రాయపడుతోంది.
పది ఎకరాల స్థలంలో షర్మిలకు విడిగా ఇల్లు ఉంది. ఉమ్మడి కుటుంబ ఆస్తిగా ప్యాలస్ ఉంది. వైఎస్ కుమార్తె నివాసంలో సర్వెంట్లు.. ఇతర సదుపాయాలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంగణం మొత్తాన్ని తన ఒక్కడి నివాసంగా మార్చేందుకు.. ఆ ముద్ర వేసేందుకు జగన్ ఈ లెటర్ రాసినట్టు చర్చ నడుస్తోంది.
జగన్ రాసిన లేఖ వెనక కుట్ర కోణం దాగి ఉందేమోనని షర్మిల వర్గం అభిప్రాయపడుతోంది. వైయస్ భారతి తన తల్లి పేరుతో ఈ ఆస్తిని.. కుమార్తెలు హర్ష, వర్ష పేర్ల మీద శాశ్వతంగా బదిలీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది. తన చెల్లెలికి దక్కాల్సిన వాటాను మొత్తం గా లాక్కుని.. ప్యాలస్ మీద మొత్తం అధికారాలు తమ కుమార్తెలకు దక్కే విధంగా చేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని విమర్శలున్నాయి.
అందువల్లే షర్మిల కుమార్తె వివాహాన్ని ఇక్కడ జరగకుండా జగన్ అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ వివాహం జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. బంధువులు ఇక్కడికి వస్తారు. షర్మిల వాటా ప్రపంచానికి తెలుస్తుంది. అదే సమయంలో ఆమెకు బలమైన అధికారిక గుర్తింపు లభిస్తుందని జగన్ భావిస్తున్నారు. ఒకవేళ అది తన సోదరి నివాసంగా అందరికీ గుర్తుండిపోతే.. భవిష్యత్తు కాలంలో దానిమీద సర్వాధికారాలు ఉండవు అనే ఉద్దేశంతోనే భద్రత డ్రామాను జగన్ తెరపైకి తెచ్చారని షర్మిల వర్గం నాయకులు అభిప్రాయపడుతున్నారు.
రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పటికే విజయమ్మ.. షర్మిలకు జగన్ నోటీసులు ఇచ్చారు. వారిని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చివరికి ఎన్సిఎల్టి వరకు వివాదాలను తీసుకెళ్లారు. చివరికి తన సోదరి కుమార్తె వివాహం విషయంలో కూడా రాజకీయంగా ఎత్తుగడలకు జగన్ శ్రీకారం చుట్టడం ఆందోళన కలిగిస్తోంది. పైగా జగన్ రాసిన లెటర్లో షర్మి.. జిలీ అంటూ ప్రస్తావించారు. ఇది ఆయన కపట ప్రేమను చూపిస్తోందని.. వైఎస్ అభిమానులు ఆరోపిస్తున్నారు