YS Sharmila: ఏపీలో ( Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని వైయస్ షర్మిల ప్రకటించి చాలా రోజులు అవుతుంది. అయితే ఆమె పిసిసి అధ్యక్షురాలిగా పదవి చేపట్టినప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎంత మాత్రం మార్పు రాకపోగా.. ఉన్న కొద్ది మంది సీనియర్లు సైతం పార్టీకి దూరమయ్యారు. ఉన్నవారు సైలెంట్ అయ్యారు. మరోవైపు షర్మిల కూడా చప్పుడు చేయడం లేదు. కనీసం ఆమె కడప జిల్లాలో సైతం కనిపించడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డితో రాజీ పడ్డారన్న ప్రచారం నడుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో క్రమేపి తన పాత్రను తగ్గిస్తున్నారని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా వేరేలా ఉందని తెలుస్తోంది. అయితే సొంత జిల్లా కడప ముఖం ఆమె చూడకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
* గౌరవప్రదమైన ఓట్లు..
గత ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు వైయస్ షర్మిల( Sharmila). దాదాపు లక్షన్నర ఓట్ల వరకు సాధించారు. అయితే ఎన్నికల సమయంలో కడప జిల్లాను విడిచి పెట్టేది లేదని.. నిరంతరంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని షర్మిల ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తిగా కనిపించకుండా మానేశారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కడపలో రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో వైయస్ షర్మిల విన్నపం మేరకు వారంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. స్వయంగా షర్మిల పోటీ చేయడంతో ఆమెకు ఓట్లు వేయగలిగారు. అయితే ఎన్నికల అనంతరం షర్మిల కడప జిల్లా ముఖం చూడడమే మానేశారు. మధ్యలో పులివెందుల వస్తున్న పాలస్కే పరిమితం అవుతున్నారు.
* మరో నేతకు చాన్స్..
కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం కోసం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. షర్మిలను మార్చి ఆ స్థానంలో కాపు నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఏపీలో కాపు నేతలకు నేరుగా ఫోన్లు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి తర్వాత ఇతర పార్టీలో చేరిన కాపు నేతలకు ఆమె టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేపథ్యం ఉన్న ఓ కుటుంబానికి చెందిన నేతకు పిసిసి పగ్గాలు ఇస్తారని కూడా ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీని సైడ్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆమెను తొలగించి మరో నేతకు అవకాశం కల్పిస్తే షర్మిలకు అవమానకరం. అందుకే ఇప్పుడు ఆమె జగన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే కుటుంబమంతా ఏకమైతే కానీ కడపలో పూర్వ వైభవం రాదని హితబోధ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం షర్మిల సోదరుడు జగన్ గూటికి చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..