YS Sharmila: జగన్ వదిలేశారు.. తండ్రి పేరును షర్మిల ఒడిసి పట్టుకోగలరా?

గత ఐదేళ్లలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అంటే రాష్ట్రానికి పండుగ రోజే. అధికారికంగా కార్యక్రమాలు జరిగేవి. రాష్ట్రవ్యాప్తంగా దానాలు, పూజలు చాలా జరిపించేవారు. ఇక అస్మదీయ సాక్షి పత్రికలు అయితే.. ఫుల్ పేజీ యాడ్లతో నింపేసేవారు. ప్రధాన సంచిక నుంచి జిల్లా టాబ్లాయిడ్ వరకు ఓ రేంజ్ లో ఉండేవి ప్రకటనలు. కానీ ఇప్పుడు జగన్ పట్టించుకోలేదు. వైసీపీ శ్రేణులు సైతం తమకు ఎందుకులే అన్నట్టు వ్యవహరించాయి. అందుకే ఆ మహానేత జయంతి వేడుకలు పెద్దగా కనిపించలేదు.

Written By: Dharma, Updated On : July 8, 2024 11:38 am

YS Sharmila

Follow us on

YS Sharmila: వైసీపీ అధికారంలో ఉన్న రోజులు ఆ పార్టీకి స్వర్ణ యుగమే. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సంబంధించి ఏ చిన్న కార్యక్రమమైనా పండగ వాతావరణం లో చేసేవారు. ప్రభుత్వ పథకాలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టేవారు.ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా చేసేవారు. ఇందుకుగాను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజశేఖర్ రెడ్డి అంటే అందరికీ అభిమానమే. అందుకే ప్రభుత్వ ధనం ఖర్చుపెట్టినా ఎవరూ అడగలేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయాక వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పేరు తలచుకునేందుకు కూడా వైసీపీ శ్రేణులు ఇష్టపడడం లేదు. ఆయన పేరు ఈ ఎన్నికల్లో పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఓ రకమైన అసంతృప్తి వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. జగన్ లో కూడా అదే వ్యక్తమవుతోంది. అందుకే ఇడుపులపాయ వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి ఊరుకున్నారు.

గత ఐదేళ్లలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అంటే రాష్ట్రానికి పండుగ రోజే. అధికారికంగా కార్యక్రమాలు జరిగేవి. రాష్ట్రవ్యాప్తంగా దానాలు, పూజలు చాలా జరిపించేవారు. ఇక అస్మదీయ సాక్షి పత్రికలు అయితే.. ఫుల్ పేజీ యాడ్లతో నింపేసేవారు. ప్రధాన సంచిక నుంచి జిల్లా టాబ్లాయిడ్ వరకు ఓ రేంజ్ లో ఉండేవి ప్రకటనలు. కానీ ఇప్పుడు జగన్ పట్టించుకోలేదు. వైసీపీ శ్రేణులు సైతం తమకు ఎందుకులే అన్నట్టు వ్యవహరించాయి. అందుకే ఆ మహానేత జయంతి వేడుకలు పెద్దగా కనిపించలేదు. ఒకటి రెండు చోట్ల చేసి సాక్షిలో పతాక శీర్షిక వేసుకొని సంతృప్తి పడడం తప్ప.. గతం మాదిరిగా వైభవంగా నిర్వహించే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.

అయితే పీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన షర్మిల.. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులను రప్పిస్తున్నారు. ఆంధ్రజ్యోతికి ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి కి అసలు సిసలు వారసురాలిగా తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారు షర్మిల. కానీ జగన్ మాత్రం ఆ అవసరం లేదన్నట్టు భావిస్తున్నారు. తండ్రి పేరును ఎంతలా వినియోగించుకోవాలో అంతలా వాడేసుకున్నారని ఆయనపై విమర్శ ఉంది. తండ్రికి మించి పాలన అందిస్తానని చెప్పిన జగన్ అనుకున్నట్టుగా సాగించలేకపోయారు. ప్రజాదరణ కోల్పోయారు. ఇప్పుడు తండ్రి పేరును కూడా వాడుకునే ఛాన్స్ వదిలేసుకున్నారు.