Andhra Pradesh Cyclone Warning : ఏపీకి( Andhra Pradesh) తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కోస్తా జిల్లాల వైపు దూసుకొస్తోంది. ఇది తీవ్రమైన వాయుగుండం గా మారింది. అందుకే మొంథా తుఫాన్ గా నామకరణం చేశారు. గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తోంది ఈ తీవ్రవాయుగుండం. ప్రస్తుతానికి చెన్నైకి 640 కిలోమీటర్లు.. విశాఖకు 740 కిలోమీటర్లు.. కాకినాడకు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
* రేపు రాత్రికి తీరం దాటనున్న వైనం
ఈరోజు ఉదయం నాటికి ఇది తుఫాన్ గా బలపడింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్ గా మారనుంది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత సుమారు 12 గంటల పాటు తుఫాను ప్రభావం కొనసాగనుంది. అయితే ఆపై బలహీన పడవచ్చని అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
* రెడ్ అలర్ట్ జారీ..
భారీ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈరోజు ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మంగళవారం 14 జిల్లాలకు రెడ్ అలర్ట్.. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ .. మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. భారీ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్ళద్దని అధికారులు సూచిస్తున్నారు. విశాఖపట్నం,గంగవరం, కాకినాడ మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ హెచ్చరికలతో సహాయ చర్యల కోసం 9 ఎస్.టి.ఆర్.ఎఫ్, 7 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
* ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, యానాం, నెల్లూరులో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
* శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, వైయస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.
* కర్నూలు, శ్రీ సత్య సాయి, అనంతపురం జిల్లాలో సైతం వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళ బుధవారాల్లో సైతం భారీ వర్షాలు నమోదుకు అవకాశాలు ఉన్నాయి.
* సీఎం కీలక ఆదేశాలు..
బంగాళాఖాతంలో భారీ వాయుగుండం నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ కదలికలపై ఎస్ఎంఎస్, సోషల్ మీడియా, ఐ వి ఆర్ ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. సమాచార లోపం లేకుండా 27 వేల మొబైల్ టవర్ల వద్ద డీజిల్ జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తీర ప్రాంతంలో మత్స్యకారులను అప్రమత్తం చేయాలన్నారు. వారికి సురక్షితమైన షెల్టర్లకు తరలించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ పునరుద్ధరణ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.