Sensational news about Kodali Nani’s health: మాజీమంత్రి కొడాలి నాని( Kodali Nani ) విషయంలో కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గుండెకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొడాలి నాని హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నారు. సడన్ గా ఆయన ఓ వివాహ రిసెప్షన్ లో కనిపించడంతో గందరగోళం నెలకొంది. కేసుల నుంచి తప్పించుకునేందుకే కొడాలి నాని అనారోగ్యం పేరుతో నాటకాలు ఆడుతున్నారని టిడిపి అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు కీలక ప్రకటన చేశారు. ఆయన సన్నిహితుడైన దుక్కిపాటి శశిభూషణ్ కొడాలి నాని ని కలిసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచన మేరకు ఈ ప్రకటన చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కొడాలి నాని అమెరికా వెళ్తారని ప్రచారం నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కొడాలి నాని అనుచరుడు ఈ ప్రకటన చేయడం విశేషం.
* వివాదాస్పద నేతగా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో కొడాలి నాని తరచూ వివాదాస్పద కామెంట్స్ చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి వాటిపై ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా కామెంట్స్ పై సైతం పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. టిడికో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, జగనన్న కాలనీల మెరక పేరుతో చదును చేసే క్రమంలో 45 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ అక్రమాలపై మరోవైపు విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2022లో నిబంధనలకు విరుద్ధంగా క్యాసినో నిర్వహించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ ఆటో నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం, గోదాము ఖాళీ చేయించారనే అంశంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఆలయ భూములకు సంబంధించి భూములను కాజేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు పై ఫిర్యాదులు వచ్చాయి.
* చివరిగా వంశీకి పరామర్శ..
ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ( Vamsi Mohan ) అరెస్టు జరిగింది. ఆయనపై కేసుల మీద కేసులు నమోదు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు కొడాలి నాని పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు. ఆ సమయంలో కూడా మీడియా ముందు దూకుడుగా మాట్లాడారు కొడాలి నాని. అయితే అప్పుడే వల్లభనేని వంశీ తరువాత అరెస్టు కొడాలి నానిదని ప్రచారం ప్రారంభమైంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటు అని నిర్ధారించారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్ కు తరలించారు. అక్కడ వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికాకు వెళ్తారని ప్రచారం సాగింది. దీంతో కేసులు నమోదైన దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఎయిర్ పోర్టులతోపాటు పోర్టులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Also Read: TDP : టిడిపికి ఒకే రోజు రూ.21.53 కోట్లు.. మహానాడు వేళ మామూలుగా లేదుగా..
* అరెస్టు భయంతో..
అయితే కొడాలి నాని ఇటీవల హైదరాబాదులో( Hyderabad) ఓ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం, మరోవైపు కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడిందని ప్రచారం జరుగుతుండడంతో అరెస్టు జరుగుతుందని ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అత్యంత సన్నిహితుడి కుమారుడి వివాహం కావడంతోనే ఆ రిసెప్షన్కు హాజరయ్యారని.. ప్రస్తుతం కరోనా కేసుల దృష్ట్యా ఆయనకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని.. అందుకే ఆయనను చూసేందుకు వైసిపి నేతలు ఎవరు హైదరాబాద్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. మరో రెండు నెలల్లో రాజకీయంగా కొడాలి నాని అందుబాటులోకి వస్తారని చెప్పుకొచ్చారు. అయితే లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో.. కొడాలి నాని అరెస్టు ఉంటుందని ప్రచారం సాగింది. అయితే అరెస్టు భయంతోనే మరో రెండు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని సంకేతాలు పంపేలా ఈ ప్రకటన చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరిగిందో వారికే ఎరుక.