AP Cabinet Meeting : ఏపీ మంత్రివర్గ( Cabinet meeting ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. భూ కేటాయింపులతో పాటు సంక్షేమ పథకాలు, పాలనాపరమైన అంశాలపై చర్చించి.. వాటికి ఆమోద ముద్ర వేసింది క్యాబినెట్. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన 700 కోట్ల రూపాయల నిధులను ఎన్సిడిసి నుంచి తీసుకునేందుకు.. పౌరసరఫరాల కార్పొరేషన్ కు బదిలీ చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తిదారుల విద్యుత్ సుంకంలో.. గతంలో ఇచ్చిన తగ్గింపులను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. 62 నియోజకవర్గాల్లో.. 63 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి.. పథకం మెరుగ్గా అమలు చేయాలని నిర్ణయించింది. తోటపల్లి బ్యారేజీ మీద హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కూడా అనుమతి ఇచ్చింది ఏపీ క్యాబినెట్. వీటితో పాటు పలు అంశాలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు.
* కొత్తగా ఇళ్ల పట్టాలు
ప్రధానంగా కొపర్తి, ఓర్వకల్లు తో పాటు రాయలసీమలోని పలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ క్యారీడార్ల ( industrial corridors )అభివృద్ధి కోసం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ క్యాబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. వ్యాధులందరికీ ఇళ్లు కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసేందుకు క్యాబినెట్ అనుమతించింది. గతంలో ఏ పథకంలోనూ లబ్ధిదారులు రుణం పొంది ఉండకూడదని, ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాలని వీటికి పరిమితులు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లు నివాస యోగ్యంగా లేనందున.. వాటిని రద్దుచేసి తిరిగి కొత్తగా కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కొన్ని లేఅవుట్లలో కొందరు ఇళ్లు కట్టుకున్నారు. కట్టలేని వారి ఇళ్లను రద్దుచేసి… వారికి వేరే చోట స్థలం కేటాయించాలని నిర్ణయించారు.
* సోలార్ కు ప్రాధాన్యం
సోలార్ విద్యుత్ యూనిట్లను( solar electrical plant ) పెద్ద ఎత్తున మంజూరు చేయాలని క్యాబినెట్లో తీర్మానించారు. ప్రజలను ప్రోత్సహించాలని కూడా డిసైడ్ అయ్యారు. ఆక్రమణలకు గురైన.. అభ్యంతరం లేని స్థలాల్లో పేదలకు నివాస స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాల పైన మంత్రివర్గం చర్చించింది. వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖలో ఆదాయాల పెంపుపై మంత్రులతో సీఎం చర్చలు జరిపారు.
* దావోస్ పర్యటన గురించి
ఈనెల 19 నుంచి నాలుగు రోజులపాటు సీఎం చంద్రబాబు( CM Chandrababu) దావోస్ పర్యటనకు వెళ్ళనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలని.. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో పారిశ్రామిక ప్రగతి లేకుండా పోయిందని.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయని.. అందుకే దావోస్ పర్యటనలో వీలైనంత ఎక్కువ పెట్టుబడులు ఆహ్వానించాలని ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మంత్రివర్గ సహచరులకు వివరించారు సీఎం చంద్రబాబు. దావోస్ పర్యటనకు వెళ్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు క్యాబినెట్ మంత్రులంతా శుభాకాంక్షలు తెలిపారు. పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.