Viveka Case : వివేకా హత్య కేసులో మరో ట్విస్టు. ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ వెంటాడుతునే ఉంది. కేసులో అవినాష్ ను నిందితుడిగా చేర్చింది. ఇప్పటివరకూ ఆయన్ను నిందితుడిగా చెప్పలేదు. కేవలం సహ నిందితుడిగా మాత్రమే చెబుతూ వచ్చింది. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. సీబీఐ తన వాదనలను వినిపించింది. బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో కీలకంగా వ్యవహరించారని తెలిపింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే.. దర్యాప్తు, సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారని ఆయన పులివెందులలో చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని గుర్తుచేస్తూ బెయిల్ ఇవ్వవొద్దని కోరింది.
ఇప్పటివరకూ సాగిన విచారణ, సీఐబీ కౌంటర్ పిటీషన్లు దాఖలు చేసే సమయంలో అవినాష్ ను సహ నిందితుడిగానే సీబీఐ పేర్కొంది. ఇప్పుడు ఏ8 ట్యాగ్ జత చేయడం విశేషం. అవినాష్ మాదిరిగా ఆయన తండ్రి భాస్కరరెడ్డి బెయిల్ పొందే చాన్స్ ఉంటుందని.. అదే జరిగితే విచారణపై ప్రభావం చూపే చాన్స్ ఉందని తెలిసి సీబీఐ తన వాదనలను బలంగా వినిపించింది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారని.. ఆయన బయట ఉంటే.. పులివెందుల సాక్షులు ప్రభావితమైనట్లేనని కౌంటర్ లో సీబీఐ స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా ప్రయోజనం ఉండదని చెప్పింది. విచారణకు సహకరిస్తున్నట్టు భాస్కరరెడ్డి చెబుతున్నది అబద్ధమేనని తేల్చిచెప్పింది.
వివేకా హత్య కేసులో పాత విషయాలను సీబీఐ మరోసారి గుర్తుచేసింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యాస్థలానికి చేరుకున్నారని అంతకు ముందే .. గంగిరెడ్డి, శివంకర్ రెడ్డి , అవినాష్ రెడ్డి మాట్లాడుకున్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని సీబీఐ తరుపు న్యాయవాది గర్తుచేశారు. కేసు పెట్టవద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్ , శివశంకర్ రెడ్డి చెప్పారన్నారు. సీబీఐ , కోర్టుకు ఏమీ చెప్పవద్దని దస్తగిరిని ప్రలోభపెట్టారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో భారీ కుట్ర ఉందని దానిపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ స్పష్టం చేసింది. అదే సమయంలో విచారణలో ఏపీ సీఎం జగన్ పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రస్తావన తీసుకొచ్చింది. వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని బయట ప్రపంచానికి తెలియక ముందే .. సీఎం జగన్ తెలుసని కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా సీబీఐ కోర్టులోనూ చెప్పింది. దీంతో మరోసారి జగన్ ప్రస్తావనను సీబీఐ తెచ్చినట్లయింది. కాగా ఇంతకు ముందే సునీత వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.