BJP: ఏపీ విషయంలో బిజెపి భారీ స్కెచ్ వేసిందా? ఆ రెండు పార్టీలను తనలో కలుపుకోనుందా? చంద్రబాబుతో పొత్తు వెనుక ఆ ఆలోచన ఉందా? ఆ షరతుతోనే కలిశారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర నడుస్తోంది. అసలు టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని బిజెపి తేల్చి చెబుతూ వచ్చింది. కానీ చివరి నిమిషంలో పొత్తుకు అంగీకరించింది. అయితే టిడిపి తో పాటు జనసేన నుంచి సానుకూల ప్రతిపాదనలతోనే బిజెపి మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది.
ఇప్పటివరకు వచ్చిన మెజారిటీ సర్వేల్లో ఏపీలో అధికార వైసీపీ మరోసారి గెలుపొందుతుందని తేలింది. చాలా సర్వే సంస్థలు వైసీపీ ఘన విజయం సాధిస్తుందని కూడా తేల్చి చెప్పాయి. ఒకవేళ ఫలితాలు మాత్రం వైసీపీకి ఏకపక్షంగా వస్తే మాత్రం.. టిడిపి, జనసేన ఉనికి ప్రశ్నార్ధకంగా మిగలనుంది. అదే జరిగితే ఆ రెండు పార్టీలను బిజెపిలో విలీనం చేయాలన్న ప్రతిపాదన అగ్ర నేతలు పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో నారా లోకేష్ అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం బిజెపిలో టిడిపి విలీన ప్రతిపాదన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అటు చంద్రబాబు సైతం పొత్తుల చర్చకు ఢిల్లీ వెళ్ళగా.. ఈ మేరకు బిజెపి అగ్ర నేతలు ప్రతిపాదించారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన దారుణంగా దెబ్బతిన్నాయి. వైసిపి ఘనవిజయం సాధించింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా వైసిపి అన్ని ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఆ రెండు పార్టీల శ్రేణులను వైసీపీ సర్కార్ తెగ ఇబ్బంది పెట్టింది. అయితే మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఆ రెండు పార్టీలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆ విషయం చంద్రబాబుతో పాటు పవన్ కు తెలుసు. అందుకే మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదని బలమైన నిశ్చయంతో ఆ ఇద్దరు నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బిజెపితో పొత్తుకు చివరి వరకు వేచి ఉన్నారు. కానీ ఏపీలో పొత్తు పెట్టుకోవడం ద్వారా బిజెపికి ఒనగూరే ప్రయోజనాలు ఏమీ లేవు. కొత్తగా వచ్చేదేమీ లేదు. అందుకే చంద్రబాబుకు కీలక ప్రతిపాదనలు బిజెపి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ గత ఎన్నికల మాదిరిగా టిడిపి ఓడిపోతే.. పార్టీని బిజెపిలో విలీనం చేయాలన్నది ఒక ప్రతిపాదనగా తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే జగన్ మరింత పట్టు బిగిస్తారు. చంద్రబాబుపై మరింత పగ సాధించడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగా కేసులను తిరగదోడుతారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు ఇతరత్రా కేసులను ఆయుధంగా వాడుకుంటారు. ఏడు పదుల వయసులో ఆ కేసులను ఎదుర్కోవడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీని బిజెపిలో విలీనం చేస్తేనే కాపాడతామని అగ్రనేతలు చంద్రబాబుకి ప్రతిపాదించారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేనకు అనుకూల ఫలితాలు రాకుంటే ఆ పార్టీ మనుగడ కూడా కష్టం. అందుకే బిజెపిలో పార్టీని విలీనం చేయించి సముచిత స్థానం కల్పిస్తామని పవన్ కు బిజెపి అగ్ర నేతలు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.