K Ravichandra Reddy: సరిగ్గా వైసిపి అధినేత జగన్( Y S Jagan Mohan Reddy ) విదేశీ పర్యటనలో ఉండగా షాక్ తగిలింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి వైసీపీని వరుసగా నేతలు గుడ్ బై చెబుతూ వస్తున్నారు. చాలా జిల్లాల్లో పార్టీ పూర్తిగా ఖాళీ అవుతోంది. పార్టీలో పదవులు అనుభవించిన వారు సైతం తాము పార్టీలో కొనసాగలేమని తేల్చి చెబుతున్నారు. చివరకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు సైతం తమ పదవులను వదులుకుంటున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తో ప్రారంభమైన వలసలు ఇప్పటికీ ఆగడం లేదు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నేతలు పెద్ద ఎత్తున పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
* వరుసగా నేతలు గుడ్ బై
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ( mopidevi Venkat Ramana) , బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా ప్రకటించారు. ఆ ఖాళీల్లో ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక ఎమ్మెల్సీలుగా ఉన్న పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయ మంగళం వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు. కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. తాజా మాజీ మంత్రులు ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి వెంకట రోశయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ సైతం అదే బాట పట్టారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
* ప్రతి జిల్లాలో వలసలు
ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో నాయకులు గుడ్ బై చెబుతూనే ఉన్నారు. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి కే రవిచంద్ర రెడ్డి( Ravi Chandra Reddy ) గుడ్ బై చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆయన సొంత నియోజకవర్గం. వైసిపి అధికార ప్రతినిధిగా గత కొంతకాలంగా కొనసాగుతున్నారు. మంచి వక్తగా పేరుంది. తరచూ మీడియా డిబేట్లో పాల్గొంటుంటారు. పార్టీ గలాన్ని సమర్థవంతంగా వినిపిస్తుంటారు. అంశాల వారీగా రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతుంటారు. వైసిపి హయాంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. కొద్దిసేపటి కిందటి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం తో పాటు అధికార ప్రతినిధి హోదాకు సైతం ఆయన రాజీనామా చేశారు.
* నెల్లూరు జిల్లాలో వరుసగా షాక్ లు
ఉమ్మడి నెల్లూరు( Nellore district) జిల్లాలో వైసీపీకి షాక్ మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా మారుతోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలతో బలంగా ఉంది. ఇటువంటి తరుణంలో వైసిపి వాయిస్ వినిపిస్తున్న రవి చంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం నిజంగా లోటు.