Prajagalam: ఏపీలో పోలీస్ శాఖ వైఫల్యం మరోసారి బయటపడింది. ముప్పేట విమర్శలను ఎదుర్కొంటోంది. జగన్ పాలన ముగిసినా.. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి యంత్రాంగం వెళ్ళినా.. ఏపీ పోలీస్ శాఖ మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వానికి సలాం చేస్తుండడం విశేషం. నిన్న చిలకలూరిపేట సభలో ప్రధాని పాల్గొన్న సంగతి తెలిసిందే. కానీ పోలీస్ శాఖ భద్రత వైఫల్యం స్పష్టంగా వెలుగు చూసింది. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సైతం ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ఏపీలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ మూడు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభను నిన్న చిలకలూరిపేటలో నిర్వహించారు. ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాధారణంగా ప్రధాని పర్యటనకు అసాధారణ భద్రత కల్పించాలి. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీస్ శాఖ సహకారం అందించాలి. ప్రధాని వ్యక్తిగత భద్రతను కేంద్ర బలగాలు చూసుకోగా.. సభా పరంగా భద్రతను చూడాల్సిన ఏపీ పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్లో.. సభను పలుచన చేయడానికి పోలీస్ శాఖ ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదం అవుతోంది. సభను ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లేనిపోని రూల్స్ పెట్టి సభకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టారని మూడు పార్టీల శ్రేణులు ఫిర్యాదు చేస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందికి దిశా నిర్దేశం చేయలేదని సమాచారం. అటు సభా ప్రాంగణంలో ప్రజలను నియంత్రించే ఎటువంటి చర్యలు చేపట్టలేదని.. చివరకు లైట్స్ టవర్ ఎక్కిన వారిని దించే ప్రయత్నం చేయలేదని.. ప్రధాని మోదీ స్వయంగా వారందరినీ కిందకు దించాలని సూచించాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అందుకే ప్రధాని భద్రతా సిబ్బంది ఈసీకి ఒక నివేదిక పంపించనున్నట్లు సమాచారం.
వాస్తవానికి పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది. గతంలో ఆయన వైసీపీకి ఫేవర్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని టిడిపి నేతలు తరచూ ఆరోపిస్తుంటారు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే చిలకలూరిపేట సభ జరగడంతో.. ఆయన చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది. ఒకవైపు ప్రధాని భద్రతా సిబ్బంది, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులకు సిద్ధపడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ముంగిట ఇలాంటి చిత్రవిచిత్రాలు మరిన్ని ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.